
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
● కలెక్టరేట్ ముట్టడిని విజయవంతం చేయాలి ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
మంచాల: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. మంగళవారం ఆయన మండల పరిధిలోని ఎల్లమ్మ తండా గ్రామంలో ఉపాధిహామీ పథకంలో పనిచేస్తున్న కూలీలను కలిశారు. ఈ సందర్భంగా వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. సీపీఎం పోరాటాల ఫలితంగానే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం తీసుకొచ్చిందన్నారు. నేటి ప్రభుత్వాలు ఉపాధి హామీ అమలులో విఫలమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా దినసరి కూలీ.600కు పెంచి ఏడాదికి 200 రోజుల పనిదినాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని ఎత్తివేసే కుట్రలో భాగంగా అలవెన్స్‌లు ఇవ్వడం లేదన్నారు. ఉపాధిహామీ కూలీలకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, టీఏ, ఏపీఓలకు సైతం నాలుగు నెలలుగా వేతనాలు ఇవ్వలేని దయనీయ పరిస్థితిలో ప్రజాపాలన సాగుతోందని ఆరోపించారు. ఆదివారం సైతం పనులు చేయిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఈ నెల 30న కార్మికుల హక్కులు, వారి సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం ఉంటుందని కార్మికులు, కర్షకులు కదలి వచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి పగుడాల యాదయ్య మాట్లాడుతూ.. సీపీఎం పేదల పక్షాన పోరాడుతుందన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్లు, సంక్షేమ పథకాలు అందాలంటే సీపీఎం పోరాటాల్లో ప్రజలు భాగస్వామ్యం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి జంగయ్య, జిల్లా నాయకులు సామేల్, జగదీష్, ఇ.నర్సింహ,వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజయ్య, కె.జగన్, నాయకులు కె. శ్రీనివాస్‌రెడ్డి, కృష్ణ, శ్యాం సుందర్, పి.జగన్, జంగయ్య, యాదయ్య, బుగ్గ రాములు తదితరులు పాల్గొన్నారు.