
హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమిద్దాం
● జాతీయ బీసీ సేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్
షాద్‌నగర్‌రూరల్: హక్కులను సాధించుకునేందుకు బీసీలు ఐకమత్యంతో ఉద్యమించాలని జాతీయ బీసీసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్ అన్నారు. మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలం ఎలికట్ట పంచాయతీ పరిధిలోని మహల్‌ఎలికట్ట గ్రామంలో జాతీయ బీసీసేన మహిళా విభాగం మండల అధ్యక్షురాలు జలజ ఆధ్వర్యంలో బీసీసేన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి జాతీయ బీసీసేన జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, నియోజకవర్గ అధ్యక్షురాలు బాస వరలక్ష్మి హాజరై మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంతో బీసీలు ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో వెనుకబడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయి తప్పితే సమస్యలను పట్టించుకోవడంలేదని విమర్శించారు. జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లను అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీలు గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. అనంతరం జాతీయ బీసీసేన మహిళా విభాగం మండల కార్యదర్శిగా సరస్వతి, గ్రామ అడహక్ కమిటీ అధ్యక్షురాళ్లుగా పిట్టల మంజుల, పెరుమాళ్ల సువర్ణ, సుప్రమోని రేణుకను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సేన తాలుకా కార్యదర్శి చంద్రశేఖర్, మండల అధ్యక్షుడు వెంకటేష్, నాయకులు నర్సింలు, బాల్‌రాజ్, స్రవంతిరాజ్, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.