
నిర్మాణం.. అయోమయం!
మొయినాబాద్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో అధికారులు వింత తీరును అవలంబిస్తున్నారు. ప్లింత్ భీంల వరకే పిల్లర్లు వేసి ఆ తరువాత గోడలు నిర్మిస్తున్నారు. గోడలపైనే స్లాబ్ వేసే విధంగా ఇంటి నిర్మాణ పనులు చేపడుతున్నారు. లబ్ధిదారులకు మాత్రం వారి ఇష్టానుసారంగా నిర్మించుకోవచ్చని చెబుతున్నారు. దీంతో ఇంటి నిర్మాణంపై స్పష్టత లేక లబ్ధిదారులు అయోమయానికి గురవుతున్నారు. సొంతింటికోసం కలలు కంటున్న నిరుపేదలకు ఇళ్లు నిర్మించుకోవడానికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద రూ.5 లక్షలు ఇస్తామని ప్రకటించింది. గత జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతగా మండలానికి ఒక్క గ్రామాన్ని ఎంపికచేసి లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసింది. అవగాహన కోసం మండల కేంద్రాల్లో నమూనా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నమూనా ఇంటి నిర్మాణం చేపట్టారు.
గోడలకు సిమెంట్ బ్రిక్స్
మొయినాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో 60 గజాల స్థలంలో ఇందిరమ్మ ఇంటి నమూనా నిర్మిస్తున్నారు. ఇందుకోసం మొదటగా గుంతలు తీసి పిల్లర్లు వేశారు. ఇంతవరకు బాగానే ఉన్నా పిల్లర్లను బేస్మింట్ లెవల్ వరకే నిర్మించారు. వాటిపై ప్లింత్ భీంలు వేశారు. అక్కడి నుంచి స్లాబ్ లెవల్‌కు ప్లిలర్లు వేయలేదు. ప్లింత్ భీంలపై గోడల నిర్మాణం చేపట్టి.. వాటిపైనే స్లాబ్ వేసేలా నిర్మిస్తున్నారు. గోడలకు సైతం సిమెంట్ బ్రిక్స్ వినియోగిస్తున్నారు. బెడ్‌రూం, కిచెన్, హాలు, బాత్‌రూం ఉండేలా ఇంటిని నిర్మిస్తున్నారు. పైకి ఎక్కడానికి మెట్లు ఉండవు. ఈ నిర్మాణాన్ని ఇటీవల వెంకటాపూర్‌కు చెందిన కొందరు లబ్ధిదారులు పరిశీలించారు. స్లాబ్ లెవల్ వరకు పిల్లర్లు లేకుండా సిమెంట్ బ్రిక్స్‌తో నిర్మించే గోడలపై స్లాబ్ వేస్తే పరిస్థితి ఎలా ఉంటుందోనని అయోమయానికి గురువుతున్నారు. అధికారులు మాత్రం లబ్ధిదారులకు ఇష్టం వచ్చిన విధంగా నిర్మించుకోవచ్చని చెబుతున్నారు.
నాలుగు విడతల్లో బిల్లులు
ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు ప్రభుత్వం నాలుగు విడతల్లో బిల్లులు చెల్లించనుంది. మొదట బేస్మింట్ లెవల్ నిర్మాణం పూర్తయిన తరువాత రూ.లక్ష, లెంటల్ లెవల్ నిర్మాణం పూర్తయి తరువాత రూ.2 లక్షలు, స్లాబ్ వేసిన తరువాత రూ.లక్ష, ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత రూ.లక్ష లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనుంది.
నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు
అవగాహన కోసం నమూనా
ప్లింత్ భీంల వరకే పిల్లర్లు.. గోడలపైనే స్లాబ్
లబ్ధిదారులు ఇష్టానుసారంగా కట్టుకోవచ్చని సూచన
అధికారుల తీరుతో గందరగోళం
రూ.5 లక్షల్లో పూర్తి కాదు
ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. మాకు నచ్చినట్టు కట్టుకుంటే రూ.5 లక్షలు సరిపోవు. అధికారులు చెప్పినట్లు నిర్మించుకుంటే గదులు చిన్నవిగా వస్తాయి. కాస్త విశాలంగా నిర్మించుకోవాలంటే సొంత డబ్బులు పెట్టుకోవాల్సి ఉంటుంది.
– ఎల్గుల రేణుక, లబ్ధిదారు, వెంకటాపూర్
గోడలపై స్లాబ్ వేసినా దృఢమే..
ఇందిరమ్మ ఇంటిని 400 చదరపు అడుగులు, అంతకంటే ఎక్కువ స్థలంలో నిర్మించుకోవచ్చు. బేస్మింట్ లెవల్ వరకు పిల్లర్లు వేస్తే భవిష్యత్తులో కుంగకుండా ఉంటుంది. గోడలపై స్లాబ్ వేసినా దృఢంగానే ఉంటుంది. లబ్ధిదారులు వారికి నచ్చినట్లుగా నిర్మించుకోవచ్చు.
– అబ్దుల్ హకీం, హౌసింగ్ ఏఈ, మొయినాబాద్