
చికిత్స పొందుతూ ఉపాధ్యాయురాలి మృతి
కొత్తూరు: రోడ్డు ప్రమాదంలో ఓ ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయురాలు మృతి చెందారు. ఈ సంఘటన కొత్తూరు పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు... పట్టణంలో నివాసం ఉంటున్న జ్యోతి(40) స్థానికంగా ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌లో ఉపాధ్యాయురాలిగా పని చేస్తుంది. ఈ నెల 11న మధ్యాహ్నం పని నిమిత్తం పాఠశాల నుంచి ఇంటికి వెళ్లేందుకు జాతీయ రహదారిని కాలినడకన దాటే క్రమంలో మినీ వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలవ్వడంతో పాఠశాల యాజమాన్యం, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ ఆమె బుధవారం మృతి చెందారు. ఈ సంఘటనపై పాఠశాల కరస్పాండెంట్ రాజశేఖర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇంట్లో గొడవ పడి
వెళ్లిపోయిన వ్యక్తి
మాడ్గుల: ఇంట్లో గొడవ పడి ఓ వ్యక్తి ఎటో వెళ్లిపోయిన సంఘటన మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరోజ్‌నగర్ గ్రామానికి చెందిన బన్నె మల్లయ్య మంగళవారం ఇంట్లో గొడవపడి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబసభ్యులు ఆచూకీ కోసం బంధువులు, స్నేహితుల ఇళ్లలో వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు అతని భార్య అనురాధ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
హోలీ సందర్భంగా
సిటీలో ఆంక్షలు
సాక్షి, సిటీబ్యూరో: హోలీ నేపథ్యంలో నగరంలో ఆంక్షలు విధిస్తూ నగర సీపీ సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం 6 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు ఇవి అమలులో ఉంటాయి. బహిరంగ ప్రదేశాలు, రోడ్డు మీద వెళ్లేవారిపై రంగులు చల్లితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాగే రోడ్లపై గుంపులుగా తిరగ వద్దని స్పష్టంచేశారు. వీటిని అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ పేర్కొన్నారు.
హెబ్రోను చర్చి ట్రస్టు వ్యవస్థాపకుడు బ్రదర్ ఎఫ్‌సీఎస్ పీటర్ కన్నుమూత
చిక్కడపల్లి: గోల్కొండ క్రాస్‌రోడ్డులోని హెబ్రోను చర్చి ట్రస్టు వ్యవస్థాపకుడు బ్రదర్ ఎఫ్‌సీఎస్ పీటర్(82) బుధవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ముషీరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. గాంధీనగర్‌లో నివసించే పీటర్‌కు భార్య రాజేశ్వరి, కుమారుడు ఇమ్మాన్యుయెల్, కుమార్తె ఎస్తేరు ఉన్నారు.