అంగన్‌వాడీల్లో అక్రమాలకు చెక్‌! | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల్లో అక్రమాలకు చెక్‌!

Mar 7 2025 9:25 AM | Updated on Mar 7 2025 9:20 AM

హుడాకాంప్లెక్స్‌: అంగన్‌వాడీ కేంద్రాల్లో అక్రమాలకు చెక్‌ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆయా కేంద్రాలకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న సరుకులు, లబ్ధిదారుల జాబితాను మరింత పారదర్శకంగా అమలు చేయాలని భావిస్తోంది. ప్రత్యేక ఆన్‌లైన్‌ యాప్‌ను తయారు చేసి, అర్హుల ముఖ చిత్రాలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌ పోర్టల్‌లో నమోదు చేయాలని ఆదేశించింది.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు..

ప్రభుత్వం గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే లక్ష్యంతో బాలామృతం, కోడిగుడ్లను సరఫరా చేస్తోంది. అర్హులైన లబ్ధిదారులకు నేరుగా వీటిని అందించాలని ప్రత్యే యాప్‌ను రూపొందించింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారి ముఖ చిత్రాలను తీసి రికార్డు చేస్తున్నాం.

– శోభాలత, అంగన్‌వాడీ టీచర్‌, సరూర్‌నగర్‌

సరుకులు పక్కదారి పట్టకుండా చర్యలు

పారదర్శకంగా ఉండేలా ప్రత్యేక యాప్‌

అర్హుల ముఖ చిత్రాల నమోదు

ఈనెల నుంచే అమలులోకి

అందించేవి ఇవే..

జిల్లాలో 1,600 అంగన్‌వాడీ కేంద్రాలు ఉండగా, మరో ఏడు ఐసీడీఎస్‌ కేంద్రాలు పని చేస్తున్నాయి. వీటిలో 1,16,142 మంది చిన్నారులు సహా 24,432 మంది గర్భిణులు, బాలింతలు పేర్లు నమోదు చేసుకున్నారు. ఆయా కేంద్రాలకు వచ్చే నిరుపేద పిల్లలు, తల్లులకు పౌష్టికాహారం అందజేస్తున్న విషయం తెలిసిందే. మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు ప్రాథమిక విద్యతో పాటు నెలకు 2.50 కిలోల బాలామృతం సహా రోజుకు ఒక గుడ్డును అందిస్తున్నారు. గర్భిణులు, బాలింతలకు 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పుతో భోజనం వడ్డిస్తున్నారు. ఆరేళ్ల లోపు పిల్లలకు 50 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పుతో భోజనం వడ్డిస్తున్నారు.

తొలి దశలో టీహెచ్‌ఆర్‌ లబ్ధిదారులకు..

అంగన్‌వాడీ కేంద్రాలకు రాని వాళ్లకు టీహెచ్‌ఆర్‌ (టేక్‌ హోం రేషన్‌) అందిస్తున్నారు. మెజార్టీ అంగన్‌వాడీల్లో ఈ సరుకులు పక్కదారి పడుతున్నాయనే ఆరోపపణలు ఉన్నాయి. వీటికి చెక్‌ పెట్టి, పారదర్శకతకు పెద్దపీట వేయడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. తొలి దశలో టీహెచ్‌ఆర్‌ లబ్ధిదారుల ముఖ చిత్రాలు నమోదు చేయాలని నిర్ణయించి, ఈ మేరకు ఈనెల నుంచి అమలు చేస్తోంది. చిన్నారుల తల్లుల ముఖ చిత్రం సహా ఆధార్‌ నంబర్‌, ఫోన్‌ నంబర్‌ యాప్‌లో నమోదు చేస్తున్నారు. సరుకులు తీసుకున్న వెంటనే ఫోన్‌కు మెసేజ్‌ వస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement