యాసంగి సీజన్‌కు యూరియా కొరత లేదు | - | Sakshi
Sakshi News home page

యాసంగి సీజన్‌కు యూరియా కొరత లేదు

Mar 7 2025 9:24 AM | Updated on Mar 7 2025 9:20 AM

కందుకూరు: యాసంగి సీజన్‌కు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని, రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరంలేదని జిల్లా వ్యవసాయాధికారి నర్సింహారావు స్పష్టం చేశారు. మండల కేంద్రంలోని పీఏసీఎస్‌ గోదాం, ఇతర ఫర్టిలైజర్‌ దుకాణాలను గురువారం ఆయన ఏఓ లావణ్యతో కలిసి తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి ఎంత మేర ఎరువులు అందుబాటులో ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. మార్చి నెలాఖరు వరకు యూరియా డిమాండ్‌ ఉన్నందున దానికి అనుగుణంగా నిల్వలను తెప్పించుకోవాలని ఏఓకు సూచించాచారు. రైతులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుని ఎప్పటికప్పుడు నిల్వలను చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ డి.చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు కృషి చేయాలి

ఇబ్రహీంపట్నం రూరల్‌: విద్యార్థుల్లో నైపుణ్యం పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అప్పుడే వారిలో సృజనాత్మకత పెంపొందుతుందని ఎమ్మెల్సీ ఏవీఎన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని రాందాస్‌పల్లి సమీపంలో ఉన్న ఏవీఎన్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం జాతీయ స్థాయి సాంకేతిక, క్రీడా పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోటీ కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం, ఆవిష్కరణలు వెలికితీయటానికి అవకాశం ఉంటుందన్నారు. యువత క్రమశిక్షణతో కూడిన విలువైన విద్యను అభ్యసించాలని తెలిపారు. వివిధ కళాశాలల నుంచి విచ్చేసిన విద్యార్థులు ఆవిష్కరణలు, క్రీడా నైపుణ్యాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ నాగేశ్వరరెడ్డి, సెక్రెటరీ నవీన్‌రెడ్డి, వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ అబ్దుల్‌ నబి, ఏఓ డాక్టర్‌ సుధీర్‌రెడ్డి, కన్వీనర్‌ సురేష్‌, కో కన్వీనర్లు డాక్టర్‌ జయరాం, డాక్టర్‌ రమేష్‌బాబు, డాక్టర్‌ మధు, డాక్టర్‌ హరిబాబు, రాజశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలి

మీర్‌పేట: సమస్యాత్మక ప్రాంతాల్లో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రాచకొండ పోలీసు కమిషనర్‌ సుధీర్‌బాబు అన్నారు. మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని నందనవనం వద్ద గురువారం చేపట్టిన విజిబుల్‌ పోలీసింగ్‌ కార్యక్రమంలో కమిషనర్‌ స్వయంగా పాల్గొన్నారు. ప్రజల నుంచి స్పందన అడిగి తెలుసుకున్నారు. వేలిముద్రల ద్వారా నేరస్తులను గుర్తించేందుకు ఉపయోగించే సాంకేతిక పరికరం పాప్లాన్‌ను ఆయన పరీక్షించారు. అనంతరం నేరుగా పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి సామాన్య ప్రజలకు అందిస్తున్న సేవలు, రిసెప్షన్‌, పెట్రోలింగ్‌ స్టాఫ్‌ పనితీరుపై ఆరా తీశారు. సీసీటీవీల నిర్వహణపై సమీక్షించారు. స్టేషన్‌ రికార్డులను పరిశీలించి, శాంతి భద్రతల నిర్వహణకు చేపడుతున్న చర్యలను తెలుసుకున్నారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, ఎస్‌ఐలకు సూచించారు. సీపీ వెంట వనస్థలిపురం ఏసీపీ కాశిరెడ్డి ఉన్నారు.

రేపు ఉచిత వైద్య శిబిరం

చేవెళ్ల: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 8న చేవెళ్లలోని పట్నం మహేందర్‌రెడ్డి ఆస్పత్రిలో ఉచిత రొమ్ము, సైర్వెకల్‌ కేన్సర్‌ స్క్రీనింగ్‌ ఉచిత వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు ఆస్పత్రి నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ శిబిరంలో మమ్మోగ్రామ్‌, పాప్‌ స్మియర్‌ టెస్టులు ఉచితంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉచిత వైద్యశిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

యాసంగి సీజన్‌కు యూరియా కొరత లేదు  1
1/1

యాసంగి సీజన్‌కు యూరియా కొరత లేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement