
నర్సింలుకు ఎంపిక పత్రం అందజేస్తున్న రాధాకృష్ణ
షాద్‌నగర్‌రూరల్: బహుజన సాహిత్య అకాడమీ అందిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ జాతీయ అవార్డుకు ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని వెలిజర్ల గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ జాంగారి నర్సింలు ఎంపికయ్యారు. సోమవారం హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో సంస్థ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా ఆయన ఎంపిక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో ప్రతీ సంవత్సరం ఉద్యమకారులు, సంఘ సేవకులు, కవులు, రచయితలకు ఈ అవార్డులను అందజేస్తున్నామన్నారు. ఏప్రిల్ 2న హైదరాబాద్‌లలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించనున్న సమావేశంలో ఈ అవార్డును అందజేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు మలగళ్ల మల్లేశ్, ప్రధాన కార్యదర్శి గంగాదేవి తదితరులు పాల్గొన్నారు.