
పట్టణ కేంద్రంలో సీపీఐ నాయకుల ర్యాలీ
చేవెళ్ల: పేదలకు ఇళ్ల పట్టాలు ఇచ్చే వరకు పోరాడుతామని.. సమస్యలు పరిష్కరించే వరకు పేదలకు అండగా ఉంటామని సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య అన్నారు. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకున్న పేదలతో కలిసి సోమవారం ఆయన ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలు గుడిసెలు వేసుకున్న ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రభుత్వాన్ని కూల్చివేయడం ఖాయమని హెచ్చరించారు. భూస్వాములు, కబ్జాదారులకు అక్రమంగా ఆక్రమించుకుంటే పట్టించుకోని ప్రభుత్వం.. 60గజాల స్థలంలో పేదలు గుడిసెలు వేసుకున్నందుకు కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు పానుగంటి పర్వాతాలు, జిల్లా కార్యవర్గ సభ్యుడు కె.రామస్వామి మాట్లాడుతూ.. జిల్లాలో భూ పోరాటాలు నిర్వహించి ఎంతో మంది పేదలకు ఇళ్ల స్థలాలు సాధించి పెట్టిన ఘనత సీపీఐకి ఉందన్నారు. చేవెళ్లలోనూ పేదలకు ఇళ్ల పట్టాలు ఇప్పించే వరకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దాదాపు 42 రోజులుగా ఇంటి స్థలాలకోసం పోరాడుతుంటే ఎమ్మెల్యేకాని.. అధికారులు గానీ పట్టించుకోకపోవటం బాధాకరమన్నారు. ఇప్పటికై నా ఎమ్మెల్యే, అధికారులు పేదల సమస్యలు పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు ప్రభులింగం, నాయకులు వడ్ల సత్యనారాయణ, సత్తిరెడ్డి, ఎన్.జంగయ్య, శ్రీను, సుధీర్, సుధాకర్‌గౌడ్, మంజుల, మాధవి, బాబురావు, శివ, మల్లేశ్, శివయ్య, కృష్ణగౌడ్, లక్ష్మణ్‌గౌడ్, శౌరీ, తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య
అక్రమంగా కేసులు బనాయించడం సరికాదు