
అంబేడ్కర్ విగ్రహానికి నివాళులర్పిస్తున్న నాయకులు
షాద్‌నగర్ రూరల్: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పించాలని ఎమ్మార్పీఎస్ రాష్ట కార్యదర్శి ఏ యాదగిరి డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో పెట్టాలని డిమాండ్ చేస్తూ ప్రారంభమైన మాదిగల సంగ్రామ పాదయాత్ర ఆదివారం షాద్‌నగర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా ఎంఎస్‌పీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ సీ అనంతయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ.. బీజేపీ నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోపే ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్‌లో చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని మండిపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లలవుతున్నా నేటికి ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టకపోవడం దారుణమన్నారు. వివిధ రాష్ట్రాల సీఎంలు వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానాలు చేసి పార్లమెంట్‌కు పంపినా కేంద్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వర్గీకరణ సాధన కోసం ఏప్రిల్ 4న బెంగళూరు – విజయవాడ జాతీయ రహదారిని దిగ్బంధం చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా కేంద్రం ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాబోవు ఎన్నికల్లో బీజేపీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు నగేష్, వినోద్, రవివర్మ, శ్రావణ్‌కుమార్, శ్రీకాంత్, అశోక్, లక్ష్మయ్య, శ్రీను, బుగ్గరాములు, ఆనంద్, పాండు, ఆవుల పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించాలి
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి యాదగిరి