ఇబ్రహీంపట్నం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్‌ఐ శేఖర్ కథనం మేరకు.. ఎల్మినేడు గ్రామానికి చెందిన పీ సత్తయ్య ఇబ్రహీంపట్నంకు బైక్‌పై బయలుదేరాడు. స్థానిక శాస్త్రా గార్డెన్ మలుపు వద్ద సాగర్ రహదారి నుంచి ఇబ్రహీంపట్నం వైపు వస్తున్న కారు బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో సత్తయ్య తలకు తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రశ్నపత్రాల లీకేజీపై
సమగ్ర విచారణ జరిపించాలి
రాజేంద్రనగర్: టీఎస్‌పీఎస్‌సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరిపించాల, అభ్యర్థులకు పరిహారం ఇవ్వాలని తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రూ. లక్షలు అప్పు చేసి గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యేసమయానికి పేపర్ లీకేజీ వ్యవహారంతో నిరుద్యోగులు నీరుగారి పోయారన్నారు. వీరిని ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. లీకేజీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లోని ఇంటి దొంగలే కారణమని స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఈ ఘటనతో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై విచారణ చేపట్టాలన్నారు. ఇందుకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్, కమిటీ సభ్యులు, నైతిక బాధ్యత వహిస్తూ పదవుల నుంచి తప్పుకోవాలని లేనిపక్షంలో ప్రభుత్వమే వీరిని తొలగించాలని డిమాండ్ చేశారు. రద్దయిన పరీక్షలను తిరిగి నిర్వహించే సందర్భంలో పరీక్ష రాసే అభ్యర్థులకు ఎలాంటి భారం లేకుండా ప్రభుత్వమే అన్ని రకాల బాధ్యతలు తీసుకోవాలని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
బీజేపీ హయాంలోనే దేశాభివృద్ధి
రాజేంద్రనగర్: దేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ ప్రజల కోసం అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటూ వారి అభివృద్ధికి పాటుపడుతున్నారని చేవెళ్ల పార్లమెంట్ కన్వీనర్ నారగూడెం మల్లారెడ్డి అన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్రమోదీ నిర్వహించే మనసులో మాట(మన్ కీ బాత్) కార్యక్రమం 99వ ఎపిసోడ్‌ను అత్తాపూర్ డివిజన్ మన్ కీ బాత్ ఇన్‌చార్జి సాయియాదవ్ ఆధ్వర్యంలో స్థానిక బీజేపీ కార్యాలయంలో వీక్షించారు. ఈ సందర్భంగా నారగూడెం మల్లారెడ్డి మాట్లాడుతూ నరేంద్రమోదీ అవయవ దానంపై చేసిన ప్రసంగం దేశ ప్రజలందరినీ ఆకట్టుకుందన్నారు. సోలార్ విద్యుత్ ప్రయోజనాలను ప్రధాని వివరించారన్నారు. వచ్చే నెల ఏప్రిల్ చివరి ఆదివారం 100 ఎపిసోడ్ పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ప్రజలందరు వీక్షించి విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో కాకుళారం సతీష్, వంశీ, నగేష్, అనూప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.