ప్రభుత్వం సైలెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం సైలెన్స్‌

May 1 2026 7:56 AM | Updated on May 1 2026 7:56 AM

● కోర్టుపైనే ‘సెస్‌’ పాలకవర్గ ఆఖరు ఆశలు ● ఎన్‌పీడీసీఎల్‌ స్వాధీనం చేసుకుని నేటికి నెల ● విద్యుత్‌ వినియోగదారుల మిశ్రమ స్పందన

‘సెస్‌’ లైసెన్స్‌..
● కోర్టుపైనే ‘సెస్‌’ పాలకవర్గ ఆఖరు ఆశలు ● ఎన్‌పీడీసీఎల్‌ స్వాధీనం చేసుకుని నేటికి నెల ● విద్యుత్‌ వినియోగదారుల మిశ్రమ స్పందన

సిరిసిల్ల: జిల్లాలో విద్యుత్‌ పంపిణీ సేవలు అందించే సహకార విద్యుత్‌ సరఫరా సంఘం లిమిటెడ్‌ (సెస్‌) పాలకవర్గం ఆశలన్నీ కోర్టుపైనే ఉన్నాయి. ఐదేళ్లకోసారి ‘సెస్‌’ వ్యాపార లైసెన్స్‌ను రెన్యువల్‌ చేయాల్సిన రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (టీజీఈఆర్‌సీ) లైసెన్స్‌ ఇవ్వకుండా ఎన్‌పీడీసీఎల్‌ పరిధిలోకి ‘సెస్‌’ను మార్చుతూ ఏప్రిల్‌ 1న ఆదేశాలు జారీ చేశారు. ‘సెస్‌’ను రద్దు చేస్తున్నట్లు టీజీఈఆర్‌సీ నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ‘సెస్‌’ సేవలు రద్దయి.. ఎన్‌పీడీసీఎల్‌ సేవలు మొదలై శుక్రవారం నాటికి (మే 1వతేదీ) నెల రోజులు అవుతుంది. విద్యుత్‌ వినియోగదారుల నుంచి ‘సెస్‌’ రద్దుపై విశ్రమ స్పందన వస్తుంది. 56 ఏళ్లుగా సేవలు అందించే ‘సెస్‌’ ఉండాలని కొందరు భావిస్తుండగా, ఎన్‌పీడీసీఎల్‌ సేవలే బాగున్నాయని మరికొందరు భావిస్తున్నారు.

‘సెస్‌’ ఉనికి కరువై నెల

2026 మార్చి 31తో ‘సెస్‌’ లైసెన్స్‌ గడువు ముగియడంతో సిరిసిల్ల ప్రాంతంలో విద్యుత్‌ పంపిణీ సేవలను ఉత్తర డిస్కంలో విలీనం చేశారు. ‘సెస్‌’ను పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకుని వ్యాపార కార్యక్రమాల నిర్వహణకు వీలుగా ఎన్‌పీడీసీఎల్‌కు టీజీఈఆర్‌సీ అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఏప్రిల్‌ 1న ‘సెస్‌’ను ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు ఆధీనంలోకి తీసుకుని విద్యుత్‌ పంపిణీ సేవలు అందిస్తున్నారు. సెస్‌ పాలకవర్గం పదవీ కాలం మరో 20 నెలలు ఉండగా, నోటీసు కూడా ఇవ్వకుండా, లైసెన్స్‌ రెన్యూవల్‌ చేయకుండా సంస్థను రద్దు చేయడాన్ని నిరసిస్తూ హైకోర్టును ఆశ్రయించారు. రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుందని, వినియోగదారులు ఓట్లు వేసి ఎన్నుకున్న పాలకవర్గ పదవీ కాలం ఉండగానే, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ ‘సెస్‌’ ఉసురు తీస్తున్నారని పేర్కొంటూ కోర్టులో కేసు వేశారు. జస్టిస్‌ వై.రేణుక ఈ కేసు విచారణకు స్వీకరించారు.. ‘సెస్‌’ విషయంలో అధికార పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులు ఒక్క మాటైనా మాట్లాడకుండా నెల రోజులుగా సైలెంట్‌గా ఉండటం విశేషం. సంస్థను ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేసిన అంశాన్ని వినియోగదారులు పెద్దగా పట్టించుకోకపోవడం గమనార్హం.

సిరిసిల్లపైనే ఫోకస్‌

‘సెస్‌’ను ఎన్‌పీడీసీఎల్‌లో విలీనం చేసుకుంటే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. 3 లక్షల మందికిపైగా వినియోగదారులున్న సంస్థను టేకోవర్‌ చేస్తే అవాంఛనీయ ఘటనలను ఏమైనా చోటు చేసుకుంటాయని అంచనా వేశారు. ఈ మేరకు ఏప్రిల్‌ 1న సంస్థను ఆధీనంలోకి తీసుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించారు. ఎంతో బిజీగా ఉంటే ఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి ‘సెస్‌’లో సమీక్షలు నిర్వహించి విద్యుత్‌ పంపిణీలో వినియోగదారులకు ఇబ్బందులు రానీయొద్దని అన్ని స్థాయిల అధికారులకు స్పష్టం చేశారు. నెల రోజుల్లో సిరిసిల్ల ప్రాంతాన్ని నాలుగు సార్లు సందర్శించి విద్యుత్‌ సేవలపై ఫోకస్‌ పెంటారు. ఎన్‌పీడీసీఎల్‌ చీఫ్‌ ఇంజినీర్లు, ఎస్‌ఈలు, ఇతర ఉన్నతాధికారులు వేములవాడ, సిరిసిల్ల ప్రాంతాల్లోనే పర్యటించారు. ‘సెస్‌’ ఎండీ భిక్షపతిని బదిలీ చేస్తూ, ఆయన స్థానంలో ఎస్‌ఈగా వేణుమాధవ్‌ నియమించారు. కొత్త విద్యుత్‌ సబ్‌స్టేషన్లకు భూసేకరణలో నిమగ్నమయ్యారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమలోని పవర్‌లూమ్స్‌ కేటగిరిని మార్చుతూ రూ.10 కోట్ల విలువైన విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను స్టోర్స్‌కు తరలించారు. రాష్ట్రవ్యాప్తంగా అమలులో ఉన్న విద్యుత్‌ విధానాలను అమలు చేస్తూ వినియోగదారులకు మెరుగైన సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వినియోగదారుల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా ముందుచూపుతో జిల్లాపై ఫోకస్‌ పెట్టారు. జిల్లాలో కొత్త తరహా విద్యుత్‌ పంపిణీ సేవలు అందుబాటులోకి రావడంతో ఒక వర్గం వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ పెద్దలకు క్షీరాభిషేకాలు చేస్తున్నారు. మరో వైపు సంస్థ ఉసురు తీయొద్దని మరో వర్గం కోరుతున్నారు.

వేసవి సెలవుల గండం

‘సెస్‌’ విలీనంపై హైకోర్టు సోమ, మంగళవారాల్లో విచారించే అవకాశం ఉంది. కోర్టు విచారణపైనే పాలకవర్గం ఆశలు సజీవంగా ఉన్నాయి. కానీ, ఆ రెండు రోజుల్లో హైకోర్టులో విచారణకు రాకుంటే.. కోర్టుకు వేసవి సెలవులు కావడంతో మళ్లీ జూన్‌లో విచారణ ఉండే అవకాశం ఉంది. ‘సెస్‌’ను ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు స్వాధీనం చేసుకుని నెల అవుతుండగా, ఎన్‌పీడీసీఎల్‌ అధికారులు ఆ సంస్థ’ యంత్రాంగంతోనే పనులు చేయిస్తుండగా, పాలకవర్గం మాత్రం ప్రతికూల పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement