● ఎన్పీడీసీఎల్‌లో విలీనం వద్దు ● సిరిసిల్ల ‘సెస్’ మహాజన సభలో ఏకగ్రీవ తీర్మానాలు
సిరిసిల్ల: సహకార విద్యుత్ సరఫరా సంఘం(సెస్)ను రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని, 56 ఏళ్లుగా విద్యుత్ పంపిణీ సేవలు అందిస్తున్న సంస్థ ఉసురుతీయొద్దని ‘సెస్’ పాలకవర్గం, విలేజీ ప్రతినిధులు ఏకగ్రీవంగా తీర్మానాలు చేశారు. జిల్లా కేంద్రం శివారులోని మణికంఠ ఫంక్షన్‌హాల్‌లో శనివారం ‘సెస్’ చైర్మన్ చిక్కాల రామారావు అధ్యక్షతన 52వ మహాజన సభ జరిగింది. రామారావు మాట్లాడుతూ జిల్లాలో 77 విద్యుత్ సబ్‌స్టేషన్లు ఉండగా.. కొత్తగా 12 సబ్‌స్టేషన్లు మంజూరయ్యాయని, మరో 21 సబ్‌స్టేషన్లకు ప్రతిపాదనలు చేశామన్నారు. ‘సెస్’లో 411 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని, సగటున 646 సర్వీసులకు క్షేత్రస్థాయి సిబ్బంది ఒకరు పనిచేస్తున్నారని తెలిపారు. గతేడాది కొత్తగా 106 ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చామన్నారు. 2023 నుంచి 429 ట్రాన్స్‌ఫార్మర్లను అమర్చి 99.22 కిలోమీటర్ల 11 కే.వీ.విద్యుత్ లైన్లను, 13.99 కిలోమీటర్ల 6.3 కే.వీ.లైన్లను, 247.75 కిలోమీటర్ల త్రీ ఫేజ్ లైన్లను వేశామని వివరించారు.
అవినీతిపై విచారణకు సిద్ధం
సెస్‌లో ఏ విచారణకైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఎన్నికై న పాలకవర్గం ఉండగా కావాలనే తొక్కిపెట్టారని ఆరోపించారు. సంస్థను రక్షించుకునేందుకు న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ‘సెస్’ను కాపాడాలని కోరుతూ విలేజీ ప్రతినిధులు తీర్మానపత్రాలను పాలకవర్గానికి అందించారు. వైస్‌చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు దిడ్డి ర మాదేవి, దార్నం లక్ష్మీనారాయణ, మల్లుగారి రవీందర్‌రెడ్డి, గౌరినేని నారాయణరావు, సందుపట్ల అంజిరెడ్డి, వరుస కృష్ణహరి, మాడుగుల మల్లేశం, పొన్నాల శ్రీనివాస్‌రావు, ఆకుల గంగారాం, రేగులపాటి హరిచరణ్‌రావు, ఆకుల దేవరాజు, కొట్టెపల్లి సుధాకర్ పాల్గొన్నారు.


