బోయినపల్లి.. సమస్యల లొల్లి
జనాభా : 3,222
ఓటర్లు : 2,507
మండల కేంద్రంలో సౌకర్యాలు శూన్యం బస్టాండ్‌లో టాయిలెట్స్ కరువు కోతులు, కుక్కల స్వైరవిహారం లో లెవల్ కల్వర్టులతో తప్పని తిప్పలు జాడలేని బోయినపల్లి–వేములవాడ డబుల్ రోడ్డు
బోయినపల్లి(చొప్పదండి): బోయినపల్లి మండల కేంద్రంలో సమస్యల లొల్లి తీరడం లేదు. ఏళ్లుగా పట్టించుకునే వారు లేక సమస్యలకు నిలయంగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం గ్రామంలో 3,222 మంది జనాభా ఉండగా.. 2,507 మంది ఓటర్లు ఉన్నారు. బోయినపల్లిలో ప్రధానంగా ఒకవైపు కోతుల మందలు ఇళ్ల పెంకులు పీకుతుంటే.. కుక్కలు మనుషులపై దాడులు చేస్తున్నాయి. కోతుల దాడిలోనూ పలువురు గాయపడ్డారు. గ్రామంలోని సీసీ రోడ్లు చిన్న వర్షం కురిసినా నీరు నిలుస్తోంది. మురుగుకాలువ వ్యవస్థ అధ్వానంగా ఉంది. బోయినపల్లి వేములవాడ, మర్లపేట వైపు బీటీ రహదారులన్ని బీటీ లేచిపోవడంతో దుమ్ము లేస్తున్నాయి.
బస్టాండ్‌లో టాయిలెట్లు లేక ఇబ్బంది
బోయినపల్లి బస్టాండ్ ప్రాంతంలో టాయిలెట్లు లేక పలు గ్రామాల ప్రజలు ఒంటికి, రెంటికి ఇబ్బంది పడుతున్నారు. వివిధ పనుల నిమిత్తం మండల కేంద్రానికి వచ్చే ప్రజలు అత్యవసర సమయంలో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళలు సమస్య ఎవరికి చెప్పుకోలేక పోతున్నారు. గతంలో మూత్రశాలలు నిర్మించాలని యువకులు ధర్నా చేసిన సంఘటనలు ఉన్నాయి.
కోతులు.. కుక్కలతో తిప్పలు
మండలకేంద్రంలోని ఏ వీధిలో చూసినా కోతులు, కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కోతుల బెదిరింపుతో దుంపెట శ్రీను అనే ఎలక్ట్రీషియన్ కిందపడగా కాలు విరిగిపోయింది. దీంతో ఆరు నెలలపాటు పని లేక ఇంటికే పరిమితమయ్యాడు. ఇలా చాలా మంది గాయపడ్డారు.
వానాకాలంలో రాకపోకలు బంద్
బోయినపల్లి నుంచి వేములవాడ, కొదురుపాక వెళ్లే బీటీ రహదారుల్లో లో లెవల్ కల్వర్టులతో వానాకా లంలో రాకపోకలు నిలిచిపోతున్నాయి. కల్వర్టుపై వరద ప్రవాహంతో గంగాధర, వేములవాడ, కొదురుపాక వైపు వాహనాల రాకపోకలు నిలిచిపోతున్నాయి.
బోయినపల్లిలో సీసీ రోడ్లపై బురద గుంతలు (ఫైల్)
సమస్యలు ఇవీ..
యువకులకు మినీస్టేడియం, ఓపెన్‌జిమ్ సైతం ఏర్పాటు చేయాలి.
బోయినపల్లి మండలకేంద్రానికి మంజూరైన సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయం సొంత భవనం లేకపోవడంతో వేములవాడలో అద్దె భవనంలో నడుస్తోంది. గురుకుల విద్యాలయం బోయినపల్లికి వచ్చేలా చూడాలి.
బీసీకాలనీలో నివసిస్తున్న ప్రజల ఇళ్ల స్థలాలు వారి పేరున వచ్చేలా చూడాలి.
అంబేడ్కర్ కాలనీలో సీసీ రహదారులు, మురుగుకాలువలు నిర్మించాలి.
మంగళవారం సంత రోడ్లపైనే నిర్వహిస్తున్నారు. సంత ఏర్పాటు చేసుకోవడానికి ప్రత్యేక స్థలం చూపాలి. వసతులు కల్పించాలి.
వర్షం కురిస్తే బోయినపల్లి రామాలయంలోకి వరద నీరు వెళ్లి నిత్యపూజలకు ఇబ్బంది పడుతున్నారు.
పలు చోట్ల పైపులైన్ లీకేజీలతో నీరు వృథాగా పోతోంది.
నూతన గ్రామపంచాయతీ భవనం నిర్మించాలి.
బోయినపల్లి.. సమస్యల లొల్లి
బోయినపల్లి.. సమస్యల లొల్లి


