కుప్పలు.. తిప్పలు!
స్థలం లేక రహదారులపైనే వడ్లకుప్పలు
రాత్రి వేళ కనిపించక ప్రమాదాలు
మూడేళ్లలో ముగ్గురు మృతి..
8 మందికి పైగా గాయాలు
ఎక్కడికక్కడే ఏర్పాటు చేయాలి
ప్రభుత్వ స్థలాలు కేటాయించాలి
రోడ్లపై రాళ్లు అడ్డుపెట్టొద్దు
చందుర్తి(వేములవాడ): రోడ్లపై ఆరబోస్తున్న వడ్ల కుప్పలు ప్రమాదాలకు నిలయంగా మారుతున్నాయి. రాత్రి వేళ వాహనదారులకు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ఏటా యాక్సిడెంట్ల రూపంలో ప్రాణాలు పోతున్నా ధాన్యం ఆరబోసుకునేందుకు ప్రభుత్వ స్థలాలు లేక రోడ్లపైనే పోస్తున్నారు. మధ్యాహ్నం వేళ ఎలాంటి ఇబ్బంది లేకున్నా రాత్రి సమయాల్లో వడ్ల కుప్పలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. గత మూడేళ్లలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 8 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.
స్థలాలు కరువు
చందుర్తి మండల కేంద్రంలోని బోడగుట్టను ఉప మార్కెట్‌యార్డు ఏర్పాటుకు అధికారులు కేటాయించినా స్థానిక నాయకుల పట్టింపు లేమితో పనులు ముందుకుసాగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఐదేళ్ల క్రితం బోడగుట్ట ప్రాంతంలో ఐదెకరాలు కేటాయించారు. ఈ భూమిని చదునుచేసే క్రమంలోనే అక్రమార్కులు కబ్జా చేశారు. ఇప్పటికీ వారి ఆధీనంలోనే ఉండడంతో ఎంచక్కా సాగుచేసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లతో రెవెన్యూ అధికారులు మరోవైపు ఉప మార్కెట్‌యార్డుకు స్థలాన్ని కేటాయించారు. ఈ భూమిని చదును చేయలేక వదిలేశారు. స్థలం ఉండి కూడా రైతులు రోడ్లపైనే ధాన్యం ఆరబోస్తున్నారు. కాగా ఆరు నెలల క్రితం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 176వ సర్వే నంబర్‌లోని ప్రభుత్వ స్థలం 20 ఎకరాల మేరకు కొనుగోలు కేంద్రానికి చూపించాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా రెవెన్యూ అధికారులు, స్థానిక కొందరు నేతలు అడ్డుతగడంతో ఈ పనులకు కార్యరూపం దాల్చడం లేదని రైతులు వాపోతున్నారు.
రాత్రిపూటనే ప్రమాదాలు
రోడ్డుపై ఉన్న కుప్పలతో రాత్రి పూట ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎదురెదురుగా లైట్లు వేసుకుని వాహనాలు రావడంతో దారి కనిపించక ధాన్యం రాశులపైకి వాహనాలు దూసుకెళ్లి ప్రమాదాలు జరుగుతున్నాయి. చందుర్తి మాజీ సర్పంచ్ మర్రి మల్లేశంతోపాటు జిగిత్యాల జిల్లా భీమారం మండలం మోత్కురావుపేటకు చెందిన ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో మృతిచెందారు. మండల కేంద్రంలోని ధాన్యం కుప్పలెక్కి వాహనాలపై నుంచి కింద పడి ఆస్పత్రుల పాలైన వారు వారు పదికి పైగానే ఉంటారు. మల్యాల, మోతుకురావుపేట, ఆశిరెడ్డిపల్లి, బండపల్లి, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన వారు తీవ్రంగా గాయపడ్డారు.
చందుర్తి గ్రామ చుట్టుపక్కల ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఎక్కడి రైతులకు అక్కడే అందుబాటులో ఉండేలా స్థలాన్ని కేటాయిస్తే ధాన్యాన్ని అక్కడే పోసుకుంటాం. కొనుగోలు కేంద్రానికి స్థలం కేటాయించకపోవడంతో రోడ్డుపై పోసుకుంటాం. అధికారులు చొరవ తీసుకుని రైతుల ప్రయోజనం కోసం పాటుపడాలి.
– చిలుక పెంటయ్య,
రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు
రైతులు ధాన్యాన్ని అమ్ముకునేందుకు కొనుగోలు కేంద్రాలు మంజూరు చేసిన, ఏర్పా టు చేయడంలో అధికారులు దృష్టి సారించ డం లేదు. గ్రామంలో ఖాళీ స్థలం ఉంటే చూసి ధాన్యాన్ని పోసుకుంటున్నాం. కొన్ని చోట్ల లారీలు, వ్యాన్‌లు వచ్చేందుకు దారిలేక తూకం వేసి సంచులను ట్రాక్టర్లతో తరలించి, లారీలో లోడు చేయించుకుంటున్నాం.
– మర్రి రాజు, చందుర్తి
రైతులు ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టుడే తప్పు. అయినా వెసులుబాటు కల్పిస్తున్నాం. రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలకు రాళ్లు అడ్డుపెడుతున్నారు. ఇవీ వాహనాలకు తాకితే అదుపుతప్పి ప్రాణాలు పోతుంటాయి. రాళ్లు తగిలి ప్రమాదానికి గురైతే సంబంధిత రైతులపై కేసులు నమోదు చేస్తాం.
– గాండ్ల వెంకటేశ్వర్లు, సీఐ, చందుర్తి
కుప్పలు.. తిప్పలు!
కుప్పలు.. తిప్పలు!
కుప్పలు.. తిప్పలు!
కుప్పలు.. తిప్పలు!


