● జిల్లాలోని 48 వైన్‌షాపులకు డ్రా పూర్తి ● 1,381 దరఖాస్
సిరిసిల్ల క్రైం: మద్యం వ్యాపారులను లక్కు వరించింది. డ్రాలో షాప్ దక్కిన వారి ఆనందానికి అవధులు లేవు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 మద్యం దుకాణాలకు కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం లక్కీ డ్రా నిర్వహించారు. ఇన్‌చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ లక్కీ డ్రా తీసి వ్యాపారులను ఎంపిక చేశారు. ఇద్దరు మహిళలకు వైన్‌షాపులు వచ్చాయి. 134 దరఖాస్తులు సమర్పించిన ఒక టీమ్‌కు మూడు దుకాణాలు, 36 అప్లికేషన్లు వేసిన మరో గ్రూప్‌నుకు మూడు వైన్‌షాపులు దక్కాయి. 74 దరఖాస్తులు వేసిన ఒక బృందానికి ఒకే ఒక్క దుకాణం దక్కింది. సింగిల్ అప్లికేషన్ వేసిన వ్యక్తులకు ఒక్క షాపు కూడా దక్కలేదు. షాపులు దక్కించుకున్న వారు డిసెంబర్ 1 నుంచి రెండేళ్లపాటు వ్యాపారాలు చేసుకోవచ్చు.
48 దుకాణాలు 1,381 దరఖాస్తులు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 48 దుకాణాలకు 1381 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తుల ద్వారా రూ.41.43కోట్ల ఆదాయం సమకూరింది. సెప్టెంబర్ 26 నుంచి టెండర్ నోటిఫికేషన్, అప్లికేషన్ల స్వీకరణ మొదలైంది. ఈనెల 18వ తేదీతో గడువు ముగిసింది. అయితే దరఖాస్తులు తక్కువగా రావడంతో ఈనెల 23వ తేదీ వరకు గడువు పొడగించి అప్లికేషన్లు తీసుకున్నారు. గడువు పొడగించడంతో రూ.కోటికి పైగా ఆదాయం పెరిగింది. కలెక్టరేట్ ఆడిటోరియంలో లక్కీ డ్రా ద్వారా వ్యాపారులను ఎంపిక చేశారు. మొదటి విడతగా ఆరోవంతు లైసెన్స్ ఫీజు ఒక్కో దుకాణానికి రూ.10లక్షలు చెల్లించారు. ఇలా 48 షాప్‌ల ద్వారా లైసెన్స్‌ల రూపంలోనే రూ.4.80కోట్ల ఆదాయం ఎక్సైజ్ శాఖకు వచ్చింది. జిల్లాలో 2025– 2027 వరకు ఈ షాపులు కొనసాగనున్నాయి. జిల్లాలోని 48 దుకాణాలకు గౌడ్లకు 9, ఎస్సీలకు 5 రిజర్వేషన్ ప్రకారం కేటాయించారు. కార్యక్రమంలో జిల్లా ఎక్సైజ్ అధికారి రాధాకృష్ణారెడ్డి, ఎక్సైజ్ సీఐలు శ్రీనివాస్, రాజేశ్వర్‌రావు సిబ్బంది పాల్గొన్నారు.


