
పాఠశాల గేట్‌కు తాళం వేసి విద్యార్థుల నిరసన
● ఉపాధ్యాయుడిని సర్దుబాటు చేయడంపై ఆందోళన
రామగుండం: అంతర్గాం మండలం లింగాపూర్ ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు శుక్రవారం గేట్‌కు తాళం వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. పాఠశాలలో 78 మంది విద్యార్థులు ఉండగా ఆరుగురు ఉపాధ్యాయులు విద్యాబోధన చేస్తున్నారు. ఇందులో ఒక టీచర్ మెటర్నిటీ సెలవుపై వెళ్లారు. మిగతా ఐదుగురిలో ఒక ఉపాధ్యాయుడిని వేరే స్కూల్‌లో సర్దుబాటు చేశారు. దీంతో నలుగురు ఉపాధ్యాయులతో తమకు నాణ్యమైన విద్యాబోధన అందడం లేదంటూ విద్యార్థులు బడి గేట్‌కు తాళం వేసి నిరసన తెలిపారు. హెచ్‌ఎం పద్మ ఈ విషయాన్ని ఎంఈవో ఏకాంబరం దృష్టికి తీసుకెళ్లారు. ఉపాధ్యాయుడిని వేరే పాఠశాలకు సర్దుబాటు చేయడంపై పేరెంట్స్ కమిటీ చైర్మన్ వేముల లావణ్య అసహనం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి గోదావరిఖనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి తరలివెళ్లారు. ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ఠాకూర్‌కు మొరపెట్టుకున్నారు. స్పందించిన ఆయన.. సమస్య పరిష్కరించాలని జిల్లా విద్యాధికారికి సూచించారు.