
ఎగువమానేరుపైనే ఆశలు
● మల్లన్నసాగర్ జలాలు వస్తేనే జలకళ ● జలాశయంలో నీటి మట్టం అంతంతే.. ● కరుగుతున్న కార్తెలు ● ఎదురుచూస్తున్న రైతులు
గంభీరావుపేట(సిరిసిల్ల): కార్తెలు కరిగిపోతున్నాయి.. వానల జాడ కరువైంది.. మరో పది, పదిహేను రోజుల్లో అన్నదాతలు వరినాట్లకు సమాయత్తం కావాల్సి ఉంది. జిల్లాలోని మూడు మండలాలకు వరప్రదాయినిగా నిలిచే గంభీరావుపేట మండలం నర్మాల ఎగువమానేరు ప్రాజెక్ట్‌పై అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 31 అడుగులు(రెండు టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 15 అడుగుల(0.5టీఎంసీ) నీటి మట్టం మాత్రమే ఉంది. ఇది కూడా తాగునీటి అవసరాలకు మాత్రమే ఉపయోగపడుతుందని అధికారులు చెబుతున్నారు. సరైన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి వరదనీరు వచ్చి చేరడం లేదు. దీంతో ఆయకట్టు రైతాంగం ఆందోళ న చెందుతోంది. బోర్లు, వ్యవసాయబావులు ఉన్న రైతులు వాటిని ఆధారంగా చేసుకొని వరి నారుమడులు సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. ప్రాజెక్టు పరిధిలో గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్ మండలాల పరిధిలో దాదాపు 17వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఏటా ఇరిగేషన్ అధికారులు ప్రత్యక్షంగా 10 వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారు.
మల్లన్నసాగర్ వైపు ఆశగా..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో నిర్మించిన మల్లన్నసాగర్ రిజర్వాయర్ ద్వారా గత మూడేళ్లుగా నీళ్లు తెచ్చి ప్రాజెక్టును నింపారు. జలాశయం పూర్తి జలకళ తెచ్చుకొని ఆయకట్టు రైతులకు వరిపంటల సాగుకు నీరందుతోంది. ప్రస్తుతం మల్లన్నసాగర్‌లో నీటినిల్వలు అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయకట్టు రైతులు మల్లన్నసాగర్ వైపు ఆశగా ఎదురు చూస్తున్నారు.
వర్షాలు లేక..
సిద్దిపేట జిల్లా కూడవెల్లి, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగుల ద్వారా వచ్చే వరదనీరే నర్మాల ఎగువమానేరు జలాశయానికి ప్రధాన ఆధారం. జూన్, జూలై నెలల్లో కురిసే వర్షాలతో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంటుంది. ఈసారి జూన్ నెల ముగిసిపోయినా సరైన వానలు లేక ప్రాజెక్టులోకి చుక్కనీరు రాలేదు. ఈ యేడు ముందస్తు మురిపించిన వర్షాలతో ఆయకట్టు రైతులు సంబురపడ్డప్పటికీ ఆ తర్వాత వరణుడు ముఖం చాటేయడంతో ఆందోళన చెందుతున్నారు. వానలు లేకపోతే మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు రాకపోతే ఆయకట్టు రైతులకు గడ్డుకాలమే.