
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
రాయికల్: మండలంలోని అల్లీపూర్‌కు చెందిన సిరిపురం శ్రీహరి (47) అప్పుల బాధతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై సుధీర్‌రావు కథనం ప్రకారం.. శ్రీహరి బీడీ ప్యాకర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబపోషణకు కొంత అప్పు చేశాడు. ఇటీవలే కూతురు పెళ్లి చేశాడు. మొత్తం రూ.8లక్షల వరకు అప్పు ఉందని, దానిని ఎలా తీర్చలోనని నిత్యం మనస్తాపం చెందుతున్నాడు. జీవితంపై విరక్తిచెంది ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు అతడిని జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడికి కుమారుడు, కూతురు ఉన్నారు. శ్రీహరి భార్య అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
పరారైన ఖైదీ కోసం లుక్ ఆఫ్ నోటీస్
జగిత్యాలక్రైం: జగిత్యాల జిల్లా కోర్టు నుంచి మంగళవారం సాయంత్రం పరారైన జున్ను ప్రసాద్ కోసం పోలీసులు ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. పెగడపల్లి మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన ప్రసాద్‌ను పట్టుకునేందుకు పోలీసు శాఖ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. ఈ ఆరు బృందాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గాలింపు చర్యలు చేపట్టాయి. నిందితుడు విదేశాలకు పారిపోకుండా బుధవారం ఉదయమే దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టులకు లుక్ ఆఫ్ నోటీసు జారీ చేశారు.
సిరిసిల్లలో కోవిడ్ పాజిటివ్ కేసులు?
● ప్రభుత్వ ఆస్పత్రిలో నిర్ధారించని వైద్యులు
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. జ్వరంతో బాధపడుతున్న ఓ దంపతులు బుధవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి వెళ్లారు. కోవిడ్ పరీక్షలు చేయడం లేదని ల్యాబ్ నిర్వాహకులు వెనక్కి పంపించినట్లు సమాచారం. సదరు దంపతులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ వచ్చినట్లు తెలిసింది. నోరు రుచి, ముక్కు వాసన పోవడంతో మూడు రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆ దంపతులు కోవిడ్‌గా అనుమానించి ప్రభుత్వ ఆస్పత్రికి రాగా.. పరీక్షలు చేయకపోవడం గమనార్హం.