సార్‌..పని ఇవ్వండి | - | Sakshi
Sakshi News home page

సార్‌..పని ఇవ్వండి

May 17 2025 7:17 AM | Updated on May 17 2025 7:17 AM

సార్‌

సార్‌..పని ఇవ్వండి

● శ్రమజీవులకు ఉపాధి వెతలు ● భవన నిర్మాణ కూలీలకు పని కరువు ● పెరిగిన ముడిసరుకు ధరలతో ఆగిన నిర్మాణాలు ● లేబర్‌ అడ్డాపై ఎదురుచూపులే దిక్కు ● పల్లెల్లో ‘ఉపాధి’ లేదు.. పట్నంలో పని కరువు

సిరిసిల్లటౌన్‌: ఒకప్పుడు భవన కార్మికుల ఉపాధికి కల్పతరువైన సిరిసిల్లలో ప్రస్తుతం పనులు దొరకడం లేదు. కార్మికులకు పనులు కల్పించడంలో ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్యంతో శ్రమజీవులకు పనిలేకుండా పస్తులుండే పరిస్థితులు వచ్చాయి. కొందరు దళారులు స్వార్థానికి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలకు తక్కువ కూలీ ఇస్తూ పనుల్లోకి తీసుకెళ్తున్నారు. శ్రమకు తగిన ఫలితం దక్కకుండా నిత్యం పనులు దొరక్క భవన నిర్మాణ కార్మికులు ప్రతిరోజు లేబర్‌అడ్డాపై పని ఇవ్వండి సారూ..అంటూ వచ్చిపోయే వారిని అర్థిస్తున్నారు. పనుల్లేకుండా అవస్థలు ఎదుర్కొంటున్న అడ్డా కూలీల వ్యథపై ప్రత్యేక కథనం.

పని కోసం పడిగాపులు

శ్రమించే చేతులకు పని లేకుండా పోయింది. పల్లెల్లో వ్యవసాయ పనులు ముగియడం.. ఉపాధి పనిలేకపోవడంతో పల్లెల నుంచి నిత్యం వందలాది సంఖ్యలో కూలీలు పొద్దున్నే సిరిసిల్లకు చేరుకుంటున్నారు. తెల్లవారుజామునే లేచి అన్నం వండుకొని సద్దిమూటలతో ఆటోలు ఎక్కి వచ్చేవారు కొందరైతే.. సైకిళ్లపై మరికొందరు వస్తున్నారు. జిల్లాలోని పదమూడు మండలాల పరిఽధిలోంచి కాకుండా.. కామారెడ్డి, సిద్దిపేట, నిజామాబాద్‌ జిల్లాల నుంచి కూడా ప్రతిరోజు చాలా మంది కూలీలు వస్తున్నారు. అయితే పల్లెల్లో వ్యవసాయ పనులు ముగియడంతోపాటు ఇటీవల సిమెంటు, సలాక రేట్లు పెరిగిపోయాయి. భవన నిర్మాణాలు చాలా వరకు తగ్గిపోయాయి. ప్రతిరోజు సిరిసిల్ల పట్టణంలోనే సుమారు 3వేల మంది భవన నిర్మాణ పనుల్లో చేరి ఉపాధి పొందేవారు. ఇప్పుడు మందగించిన పనులతో అడ్టాపై కార్మికులకు నాలుగు రోజులకోసాసారి పనులు దొరుకుతున్నాయి. నిత్యం వందలాది మంది కూలీలు పని దొరక్క నిరాశతో ఇంటిదారి పడుతున్నారు.

ఉపాధికి ధరాఘాతం

గతంలో క్వింటాలు సలాక రూ.5వేలు ఉండగా.. ఇప్పుడు రూ. 6వేలు, సిమెంటు రూ.300 ఉండగా.. ప్రస్తుతం రూ.360, ఇటుక లోడ్‌ రూ.17 వేలు ఉండేది కాగా ప్రస్తుతం రూ.21వేలకు చేరినట్లు కార్మికులు, భవన నిర్మాణదారులు చెబుతున్నారు. స్థానిక అవసరాలకు ఇసుకను తోడేందుకు అధికారులు నిత్యం అనుమతులు ఇవ్వడం లేదు. ఫలితంగా భవన నిర్మాణ పనులు సరిగ్గా జరగడం లేదు. ఇతర రాష్ట్రాల కూలీలు కూడా రావడంతో సిరిసిల్లలో స్థానికులకు పని దొరకడం లేదు.

అడ్డా కూలీల అవస్థలు ఇవీ

● సిరిసిల్ల లేబర్‌ అడ్డాకు షెడ్డు లేదు. ఫలితంగా కార్మికులు ఎండకు, వానకు ఇబ్బందులు పడుతున్నారు.

● అడ్డాపై కనీసం మరుగుదొడ్డి వసతి లేదు. పనులు దొరకని అవస్థకు తోడుగా ఒంటికి, రెంటికి పోవాలన్నా.. గుక్కెడు నీళ్లు తాగాలన్నా డబ్బులు పెట్టుకోవాల్సి వస్తుంది.

● అపార్టుమెంట్లలో పనిచేసే కార్మికులకు సేఫ్టిథింగ్స్‌ హెల్మెట్స్‌, గ్లౌజులు ఇవ్వడం లేదు.

● పనికి వచ్చే కార్మికులకు గుర్తింపుకార్డులు అందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు కార్మికులు ఆరోపిస్తున్నారు.

● అడ్డాపైన వైద్య, ఆరోగ్య శిబిరాలు నిర్వహించడం లేదు.

పని లేకుంటే ఇబ్బందే..

నేను, నా భార్య లక్ష్మీనర్స వ్వ, కొడుకు అజయ్‌.. కూలీ పనిచేసుకుని బతుకుతాం. ఊరిలో బయట నుంచి వ చ్చిన కూలీలతో మాకు పనులు దొరుకుతలేవు. నేను ఇంట్లో నుంచి 6 గంటలకు బయలుదేరి సిరిసిల్లకు 7 గంటల వ రకు వస్తా. వారంలో రెండు రోజులే పని దొరుకుతుంది. మిగతా రోజుల్లో ప్రతిరోజు రూ.80 బస్సు కిరాయిలు మీద పడుతున్నాయి.

– అల్లెపు సురేష్‌, గజసింగవరం

ఇరవై ఏళ్లుగా సిరిసిల్లకు వస్తున్న

నేను ఇరవై ఏళ్లుగా సిరిసిల్ల లేబర్‌ అడ్డాపైకి వస్తున్న. ఏడాది సంది పనులు సరిగా దొరుకుతలేవు. రాను పోను రూ.30 ఖర్చు అవుతాయి. ఇద్దరు ఆడపిల్లలను సాకాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి కూలీలు తక్కువ పైసలు తీసుకుంటుండ్రని మాకు పనులు ఇస్తలేరు. కమీషన్‌ ఏజెంట్లు వాళ్ల కోసం ప్రత్యేకంగా అడ్డా పెట్టిండ్రు. దళారుల స్వార్థానికి మాలాంటోళ్లకు పనులు దొరకనివ్వట్లేదు.

– గోరిబీ, రాళ్లపేట

గుర్రాలగొంది నుంచి వస్తున్న

నేను సిద్దిపేట జిల్లా గుర్రాలగొంది నుంచి ఇరువై ఏళ్లుగా ఇక్కడికి వస్తున్న. రానుపోను బస్సు కిరాయిలు రూ.70 పోతయి. ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలతో పోటీ ఎక్కువైంది. మరో దిక్కు స్థానికంగా ఇసుక దొరక్క భవన నిర్మాణాలు తగ్గి మాకు పనులు దొరుకుతలేవు. ఉదయం 5గంటలకు ఇంటి నుంచి వెళ్లిన. పని దొరకకుంటే నిన్న వచ్చిన కూలీ డబ్బులోంచి బస్సు కిరాయి పెట్టుకోవాలి.

– ఎ.శివారెడ్డి, గుర్రాలగొంది

పనులు తగ్గి.. పోటీ ఎక్కువైంది

సిరిసిల్లలో ఇతర రాష్ట్రాల కూలీలతో స్థానిక కూలీలకు పనులు తగ్గి కూలీలకు పోటీ ఎక్కువైంది. మాకు నిత్యం పనులు దొరుకుతలేవు. ఊర్లలో వ్యవసాయ పనుల్లేవు. ఇక భవన నిర్మాణ ముడిసరుకుల ధరలు ఎక్కువైనయి. ఇసుకను రోజు ఇవ్వడం లేదు. ఫలితంగా చాలామటుకు నిర్మాణాల పనులు సరిగ్గా నడవడం లేదు. స్థానిక అవసరాలకు మొరం, ఇసుక రోజు అనుమతించాలి.

– కోల శ్రీనివాస్‌, అడ్డా కూలీల అధ్యక్షుడు

సంక్షేమ పథకాలు అందడం లేదు

భవన నిర్మాణరంగ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అందడం లేదు. లేబర్‌అడ్డాౖ పె కనీసం నీడ లేదు. ఎండలు, వానలకు నిలబడాలి. బా త్రూమ్‌కు వెళ్లాలంటే, నీళ్లు తాగాలంటే రూ.5 ఖర్చు చేసుకోవాల్సిన పరి స్థితి. ఇది ఉన్నతాధికారులకు చెప్పినా అడ్డాపై కనీస వసతులు కల్పించడం లేదు. బయట కూలీలు, స్థానిక కూలీలకు ఒకే దగ్గర అడ్డా ఉంచితే అందరికీ పనులు దొరికేలా చూడాలి. – ఎగమంటి ఎల్లారెడ్డి, సీఐటీయూ అధ్యక్షుడు

సమాచారం

భవన కార్మికులు : 70 వేలు

నమోదైన కార్మికులు: 50వేలు

సిమెంటు బ్యాగు ధర: రూ.360

సలాక(క్వింటాలుకు): రూ.6వేలు

ఇటుక(2వేల పీసులు): రూ.18,500

ఇటుక(బ్రాండెడ్‌, 2వేల పీసులు): రూ.21వేలు

సార్‌..పని ఇవ్వండి1
1/6

సార్‌..పని ఇవ్వండి

సార్‌..పని ఇవ్వండి2
2/6

సార్‌..పని ఇవ్వండి

సార్‌..పని ఇవ్వండి3
3/6

సార్‌..పని ఇవ్వండి

సార్‌..పని ఇవ్వండి4
4/6

సార్‌..పని ఇవ్వండి

సార్‌..పని ఇవ్వండి5
5/6

సార్‌..పని ఇవ్వండి

సార్‌..పని ఇవ్వండి6
6/6

సార్‌..పని ఇవ్వండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement