కలెక్టర్ సందీప్ కుమార్
సిరిసిల్ల: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా, పకడ్బందీ నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం పరీక్షల నిర్వహణపై సమీక్షించారు. పరీక్ష కేంద్రాలను శుభ్రం చేయించాలని, తాగునీటి వసతి కల్పించాలని, వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. వైద్యసిబ్బ ంది వద్ద ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు ఉండాలని, పరీక్షలు నిర్వహించే రోజుల్లో ఆర్టీసీ బస్‌లను సమయానుకూలంగా నడిపించాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్ గదిలో సీసీ కెమెరాలు ఉండాలని తెలిపారు.
144 సెక్షన్ అమలు
పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుంది. 22 నుంచి జరిగే పరీక్షలకు 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఫస్టియర్‌లో 2,385, సెకండియర్‌లో 1,478 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురావద్దని అధికారులు సూచించారు. అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, ఎస్బీ డీఎస్పీ మురళి, డీఈఐవో శ్రీనివాస్, డీఎంహెచ్‌వో రజిత, ఆర్టీసీ డీఎం ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.
జిల్లాలో సాండ్ ట్యాక్స్ అమలు
సిరిసిల్ల: జిల్లాలో సాండ్ ట్యాక్స్ ద్వారా ఇసుక రవాణాకు అనుమతి ఇవ్వనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ప్రకటనలో తెలిపారు. ఇసుక రవాణాను ఆన్‌లైన్ చేయనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని ట్రాక్టర్ యజమానులు అందరూ తమ వాహనాల లైసెన్స్, ఇతర అన్ని పత్రాలు, డ్రైవర్ వివరాలు, డ్రైవింగ్ లైసెన్సు పత్రాలను కలెక్టరేట్‌లో వారంలోగా అందించి నమోదు చేసుకోవాలని కోరారు. ట్రాక్టర్ యజమానులు జిల్లా కలెక్టర్ పేరిట రూ.10వేల డీడీ తీయాలని తెలిపారు. అనుమతి పొందిన సాండ్ రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక రవాణా చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలి
రుద్రంగి(వేములవాడ): భూ భారతిలో భాగంగా నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కోరారు. రుద్రంగి మండల పరిధిలోని దెగావత్‌తండా గ్రామంలో దరఖాస్తులు స్వీకరించారు. గైదిగుట్టతండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించారు. ఈ గ్రామం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపికవగా.. 44 ఇళ్లు మంజూరయ్యాయి. 23 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఎంపీడీవో నటరాజ్, ఎంపీఓ సుధాకర్, రెవెన్యూ అధికారులు షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలి