
అభివృద్ధి చేస్తే అడ్డుతగులుతారా ?
● రాజన్న ఆలయంపై రాజకీయం చేయొద్దు ● అభివృద్ధికి సహకరించాలి ● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ: గత ప్రభుత్వాల హయాంలో అభివృద్ధికి నోచుకోని వేములవాడ రాజన్న ఆలయం, పట్టణాన్ని రూ.76కోట్లతో అభివృద్ధి చేస్తామంటే బీజేపీ, బీఆర్‌ఎస్ నాయకులు అడ్డు తగులుతున్నారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. అభివృద్ధిని జీర్ణించుకోలేకనే రెండు పార్టీలు వేములవాడ బంద్‌కు పిలుపునిచ్చి రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. వేములవాడలో బుధవారం విలేకరులతో మాట్లాడారు. భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా, అనువంశిక అర్చకులు, స్థానికులు, ప్రముఖుల సలహాలతో శృంగేరి పీఠాధిపతుల అనుమతులతో పనులు చేపడతామని స్పష్టం చేశారు. మూలవిరాట్టు, తదితర విగ్రహాలను టచ్ చేయకుండానే ఆలయాన్ని విస్తరిస్తామని చెబుతున్నా.. ప్రతిపక్షాలు ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం ప్రగల్భాలు పలికారే తప్ప ఆలయాభివృద్ధికి రూపాయి ఇవ్వలేదన్నారు. బీజేపీ నాయకులు పదిహేనేళ్లుగా అధికారంలో ఉన్నా ఎలాంటి నిధులు తీసుకుని రాలేదని గుర్తు చేశారు. ఆలయాన్ని మూసివేయబోమని స్పష్టం చేశారు. ఆలయ నిర్మాణం పనులు కొనసాగే సమయంలో మాత్రమే భీమన్న ఆలయంలో దర్శనావకాశాలు కల్పిస్తామని తెలిపారు.