
తాళం వేస్తే టార్గెట్
ఇది ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌లోని సీసీ కెమెరా. గత పాలకవర్గం ఆధ్వర్యంలో దాదాపు రూ.1.60 లక్షలు వెచ్చించి 12 సీసీ కెమెరాలతో గ్రామంపై నిఘా పెట్టారు. అయితే ప్రస్తుతం అందులో మూడు సీసీ కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నాయి. వాటిని రిపేర్ చేయించడం లేదు. గ్రామంలో పాలకవర్గం లేకపోవడంతో వాటిని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఏదైనా సంఘటన జరిగితే నిందితులను పట్టుకోవడం ఇబ్బంది కానుంది.
● వరుస చోరీలతో జనం బెంబేలు
● జిల్లాలో ఇటీవల పెరిగిన దొంగతనాలు
● పట్టపగలే ఇళ్లు లూఠీ
● పనిచేయని సీసీ కెమెరాలు
● దొరకని దొంగలు
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): తాళం వేసిన ఇళ్లే లక్ష్యంగా దొంగలు తెగబడుతున్నారు. వరుస దొంగతనాలతో జిల్లా ప్రజలు భయాందోళన చెందుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో దొంగలు దొరకడం లేదు. వేసవి సెలవులు కావడం, శుభాకార్యాలు ఎక్కువగా ఉండడంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు భయం..భయంగా గడుపుతున్నారు. ఇదే అదునుగా దొంగలు ఇళ్లను గుళ్ల చేస్తున్నారు. పట్టపగలే ఇళ్లను టార్గెట్ చేస్తూ ఉన్నది ఊడ్చుకుపోతున్నారు. లక్షల్లో సొమ్ము, భారీ ఎత్తున బంగారం నగలు పోతుండడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.
వరుస దొంగతనాలు.. ఆందోళనలో ప్రజలు
● జిల్లాలో ఇటీవల వరుసగా దొంగతనాలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 255 గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో సగానికిపైగా పనిచేయడం లేదు. దీంతో దొంగతనాలు పాల్పడ్డ వారి ఆచూకీ దొరకడం లేదు.
● తాజాగా గంభీరావుపేట మండలం నాగంపేటలో పది రోజుల క్రితం ఒకే రోజు తాళం వేసి ఉన్న పది ఇళ్లలో దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం, విలువైన బట్టలు, భారీ ఎత్తున నగదు పోయింది. ఇంత పెద్ద సంఘటన జరగడంతో జిల్లా ప్రజలు శుభకార్యాలకు బంధువుల ఇళ్లకు వెళ్లేందుకు భయపడుతున్నారు.
● ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని ఒద్దిరాల శ్రీనివాస్ ఇంట్లో ఈనెల 9న పట్టపగలే తాళం పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. బీరువాను ధ్వంసం చేసి రూ.25వేల నగదు, 3 తులాల బంగారం కమ్మలు, చైన్లు, 15 తులాల వెండి పట్టగొలుసులను ఎత్తుకెళ్లారు.
● నెల రోజల క్రితం ఎల్లారెడ్డిపేటకు చెందిన నాగుల ప్రదీప్‌గౌడ్ ఇంట్లో చోరీ జరిగింది.
● ముస్తాబాద్, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి, వేములవాడరూరల్ మండలాల్లోని ఆలయాల్లో దొంగలు హుండీలను ఎత్తుకెళ్లిన ఘటనలున్నాయి.
శుభకార్యాల వేళ దొంగల హల్‌చల్
ఈ వారం, పది రోజులుగా పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుండడంతో బ్యాంక్ లాకర్లలో దాచిన బంగారు నగలతోపాటు కుదువపెట్టిన వాటిని తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటున్నారు. ఇదే సమయంలో దొంగలు పడుతుండడంతో బంగారు నగలు చోరీకి గురవుతున్నాయి. ఇటీవల తులం బంగారం రూ.లక్షకు చేరడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఉన్న బంగారాన్ని కాపాడుకునేందుకు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు బంధువుల ఇళ్లకు వెళ్లిన వారు సైతం సాయంత్రం వరకు ఇళ్లకు తిరిగి వస్తున్నారు.
దొంగలను పట్టుకుంటాం
దొంగతనాలపై నిఘా పెట్టాం. సంఘటన జరిగిన రోజు క్లూస్‌టీమ్‌తో వేలిముద్రలు సేకరించి, పాత నేరస్తులను విచారిస్తున్నాం. రాత్రిపూట పెట్రోలింగ్‌ను ముమ్మరం చేస్తాం. ఇళ్లకు తాళం వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలి. ఇంటికి తాళం వేస్తున్న సమయంలో విలువైన వస్తువులను వెంట తీసుకెళ్లాలి.
– శ్రీనివాస్‌గౌడ్, సీఐ, ఎల్లారెడ్డిపేట
ఈ చిత్రం గంభీరావుపేట మండలం నాగంపేటలో ఇటీవల జరిగిన దొంగతనంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. పది రోజుల క్రితం నాగంపేటలో ఒకే రోజు తాళం వేసి ఉన్న పది ఇళ్లలో దొంగలు పడ్డారు. ఇటీవల ఇంత పెద్ద ఎత్తున దొంగలు పడ్డ సంఘటనలు జిల్లాలో లేవు. పెద్ద ఎత్తున బంగారం, నగలను ఎత్తుకెళ్లారు. తాళం వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తుండడంతో వేసవి సెలవుల్లో వివిధ ప్రాంతాల దర్శనానికి, బంధువు ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వెళ్లాలంటే ప్రజలు జంకుతున్నారు.

తాళం వేస్తే టార్గెట్

తాళం వేస్తే టార్గెట్

తాళం వేస్తే టార్గెట్