
మండుటెండల్లో నీటిజాడలు
మండుటెండల్లోనూ నీటి ఊటలు ఊరుతున్నాయి. ఈ సంవత్సరం వర్షాకాలంలో సరైన వర్షాలు కురువకపోయినా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో నీటి ఊటలు, చెక్‌డ్యామ్‌లు స్థానికంగా నీటి కొరతను తీరుస్తున్నాయి. వన్యప్రాణుల దాహార్తి తీరుస్తున్నాయి. నిండు ఎండాకాలంలోనూ గలగల పారుతున్నాయి.
పాతికేళ్లుగా నీటి కొరతకు చెక్
ముస్తాబాద్(సిరిసిల్ల): మండలంలోని మోహినికుంటలో ఒకప్పుడు ఎటూ చూసినా బీడు భూములు కనిపించేవి. ఉపాధి కరువై ఊరిలోని పురుషులు ముంబయి, దుబాయ్‌కి వలసపోయేవారు. నీటివసతి లేని మోహినికుంటలో 25 ఏళ్ల క్రితం నిర్మించిన చెక్‌డ్యామ్ నేడు జీవనాధారమైంది. వాటర్‌షెడ్ స్కీం ద్వారా 2002లో అప్పటి ఎంపీటీసీ కల్వకుంట్ల గోపాల్‌రావు ఆధ్వర్యంలో నర్సింలవాగుపై చెక్‌డ్యామ్ నిర్మించారు. ఎగువ రాజక్కపేట చెరువు మత్తడి దూకి చెక్‌డ్యామ్‌లోనే చేరగా కొంతమేరకు మోహినికుంటలో భూగర్భ జలాలు పెరిగాయి. ఒక్క చెరువు కూడా లేకపోవడం, ఒకే ఒక చెక్‌డ్యామ్‌పై ఆధారపడ్డ మోహినికుంట వాసులు క్రమంగా బోర్లు, బావులు తవ్వించి వ్యవసాయం వైపు మళ్లారు. ఈక్రమంలో మల్లన్నసాగర్ నీరు ఏడేళ్లుగా వస్తుండడంతో చెక్‌డ్యామ్ నిండా నీరు చేరుతుంది. దీంతో స్థానికంగా భూగర్భజలాలు పెరిగి వలసలు తగ్గి ఊరిలో పంటల సాగు పెరిగింది.
భూగర్భ జలాలు పెరిగాయి
పాతికేళ్ల క్రితం మోహినికుంటలో చెరువు, కుంటలు లేవు. కరువుతో మగవారు వలసలు వెళ్లారు. అప్పటి కేంద్ర, రాష్ట్ర మంత్రులు విద్యాసాగర్‌రావు, సుద్దాల దేవయ్య సహకారంతో వాగుపై చెక్‌డ్యామ్ నిర్మించాం. అదే ఇప్పుడు ఆధారమైంది. భూగర్భ జలాలు పెరిగి వ్యవసాయం చేసుకుంటున్నాం.
– కల్వకుంట్ల గోపాల్‌రావు,
రైతు నాయకుడు

మండుటెండల్లో నీటిజాడలు