
ఉచిత శిక్షణ.. ఉన్నతికి నిచ్చెన
● స్వచ్ఛంద సంస్థల సేవ.. విద్యార్థుల భవితకు తోవ ● సద్వినియోగం చేసుకుంటున్న పేద విద్యార్థులు
సిరిసిల్లకల్చరల్: కార్మిక క్షేత్రంలో నిరుపేద విద్యార్థులకు ఉచిత శిక్షణ వారి ఉన్నతికి ఆలంబనగా నిలుస్తోంది. జిల్లా కేంద్రంలో పలు స్వచ్ఛంద, ధార్మిక సంస్థల నేతృత్వంలో పోటీ పరీక్షలకు ఇస్తున్న ఉచిత శిక్షణతో కార్మిక కుటుంబాల పిల్లలకు మేలు కలుగుతోంది. సిరిసిల్లలో వివిధ ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి రంగ నిపుణుల ఐక్య వేదికగా పోపా (పద్మశాలి అఫిషియల్స్, ప్రొఫెషనల్స్ అసోసియేషన్) మూడు దశాబ్దాలుగా పలు సామాజిక సేవలు అందిస్తోంది. ప్రతి వేసవిలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు నెల రోజుల పాటు ఉచితంగా పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష కోసం శిక్షణ ఇస్తోంది. సుమారు 120 మంది విద్యార్థులు రోజూ తరగతులకు హాజరవుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా ఆయా సబ్జెక్టుల్లో నిపుణులైన పద్మశాలి ప్రభుత్వ, ప్రైవేట్ ఉపాధ్యాయులు తమ సేవలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు.
శ్రీ సత్యసాయి సేవాసమితి ఆధ్వర్యంలో..
కొన్నేళ్లుగా సిరిసిల్లలో శ్రీ సత్యసాయి సేవాసమితి ధార్మిక సంస్థ డైట్ సెట్, పాలీసెట్‌లకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహిస్తోంది. కోవిడ్ సమయంలో అంతరాయం ఏర్పడినా తిరిగి యథావిధిగా క్లాసులు నిర్వహిస్తోంది. వాసవీనగర్‌లోని సమితికి చెందిన మందిరంలో పాలిటెక్నిక్ శిక్షణకు వందమందికి పైగా విద్యార్థులు హాజరవుతున్నారు. సత్యసాయి భక్తులైన సబ్జెక్టు నిపుణులు స్వచ్ఛందంగా తమ సేవలు అందిస్తున్నారు.