
ఫిర్యాదులు ఆన్‌లైన్‌లో నమోదు
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్ల: ప్రజల నుంచి వచ్చిన ప్రతీ ఫిర్యాదును ఆన్‌లైన్‌లో నమోదు చేసి ఆ సమస్య పరిష్కారమయ్యే సమీక్షిస్తామని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఆఫీస్‌లో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన 32 మంది బాధితులు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను పరిష్కరించాలని ఆయా పోలీస్ స్టేషన్ అధికారులకు నేరుగా ఫోన్ చేసి సూచించారు. ఎస్పీ మాట్లాడుతూ బాధితులకు సత్వర న్యాయం అందించే లక్ష్యంతో ప్రతీ సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నామన్నారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజాసమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తున్నామన్నారు. పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సూచించారు. ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి చట్టప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.