
భూకంపం కలకలం
● రెండు సెకన్లు కంపించిన భూమి ● జిల్లాలో 40 ఏళ్ల తర్వాత ప్రకంపనలు
సిరిసిల్ల: జిల్లాలో సోమవారం భూమి కంపించింది. సాయంత్రం 6.49 గంటలకు రెండు నిమిషాలపాటు కంపించడంతో జనం ఉలిక్కిపడ్డారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతోపాటు ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, వీర్నపల్లి, తంగళ్లపల్లి, ఇల్లంతకుంట, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి, బోయినపల్లి, వేములవాడ అర్బన్, వేములవాడ రూరల్ మండలాల్లోనూ భూమి కంపించింది. భయంతో జనం రోడ్లపైకి వచ్చారు. వాహనాల్లో వెళ్తున్న వారికి భూకంపం ప్రభావం పెద్దగా కనిపించకపోగా.. ఒక్కచోట ఉండి పనిచేసే వారికి భూకంపం కదలికలు స్పష్టంగా తెలిశాయి. జనం ఒకింత ఆందోళనకు గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా రెండు సెకండ్లపాటు వచ్చిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 3.8గా నమోదైనట్లు తెలుస్తోంది. సిరిసిల్ల, వేములవాడ ప్రాంతంలో 40 ఏళ్ల కిందట ఇదే తరహాలో ఐదు సెకండ్ల పాటు భూకంపం వచ్చింది. మళ్లీ ఇప్పుడు రావడం చర్చనీయాంశమైంది. రాత్రి పూట మళ్లీ ఏమైనా భూకంపం వస్తుందా..? అని జనం ఆందోళనకు గురవుతున్నారు.