● సెంట్రల్ సిల్క్ బోర్డు సభ్యురాలు డాక్టర్ భాగ్య ● 300 మంది రైతులకు అవగాహన
జనగామరూరల్: పట్టు పరిశ్రమకు తెలంగాణ నేలలు అనుకూలమని, ఈ పరిశ్రమపై రైతులు దృష్టి సా రించాలని సెంట్రల్ సిల్క్ బోర్డ్ సభ్యురాలు డాక్టర్ భాగ్య అన్నారు. శుక్రవారం జనగామ మండలం పెంబర్తిలోని శివం ఫంక్షన్ హాల్‌లో ప్రాంతీయ పట్టు పరిశోధన కేంద్రం, సెంట్రల్ సిల్క్ బోర్డ్ ఆధ్వర్యంలో సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరి, ములుగు, మహబూబాబాద్, జనగామ, నల్లగొండ, సూర్యాపేట, నిర్మల్, మంచిర్యాల, వరంగల్, హనుమకొండ, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలకు చెందిన 300 మంది రైతులకు అవగాహన కల్పించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భాగ్య మాట్లాడుతూ.. పట్టు పరిశ్రమలతో ఎకరానికి రూ.3 నుంచి రూ.4 లక్షల ఆదాయం వస్తోందన్నారు. రాష్ట్రంలో 15,679 ఎకరాల్లో 6వేల మందికిపైగా రైతులు మల్బరీ సాగు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కువగా దిగుబడినిస్తున్న బైవోల్తిన్ పట్టు పురుగులను రైతులు పెంచుతున్నట్లు చెప్పారు. రైతులకు బిందు సేద్యం వసతి కల్పిస్తున్నారని తెలిపారు. జనగామ జిల్లాకు కేంద్రం మల్బ రీ గుడ్ల ఉత్పత్తి కేంద్రాన్ని మంజూరు చేసిందని తెలిపారు. వినోద్‌యాదవ్, మీనాక్షి, బీటీ శ్రీనివాస్, మొగిలి, హార్టికల్చర్ అధికారి లత పాల్గొన్నారు.