
బోయినపల్లిలో లబ్ధిదారుల సమావేశం
కోనరావుపేట(వేములవాడ): మామిడిపల్లిలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు రావాలని జెడ్పీ చైర్‌పర్సన్ న్యాలకొండ అరుణను జూనియర్ అసిస్టెంట్ కోల కమలాకర్ ఆహ్వానించారు. ఈమేరకు శుక్రవారం ఆహ్వానపత్రిక అందించారు. ఈనెల 29 నుంచి ఏప్రిల్ 6 వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 30న సీతారాముల కల్యాణం, ఏప్రిల్ 6న రథోత్సవం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. కొక్కుల నర్సయ్య, ఎల్లారెడ్డి, అనిల్ ఉన్నారు.
అడ్వకేట్ అసోసియేషన్ ఎన్నికలకు నామినేషన్లు
వేములవాడ: వేములవాడ బార్ అసోసియేషన్ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల ప్రశాంతంగా ముగిసినట్లు ఎన్నికల అధికారి గుడిసె సదానందం తెలిపారు. ఈనెల 28న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. అడ్వకేట్లు తమ ఓటుహక్కును ప్రజాస్వామ్యబద్ధంగా వినియోగించుకోవాలని కోరారు. అధ్యక్షుడికి 4, ఉపాధ్యక్షుడికి 3, జనరల్ సెక్రటరీ 2, జాయింట్ సెక్రటరీకి 2, లైబ్రరీ సెక్రటరీకి 3, స్పోర్ట్స్ సెక్రటరీకి 2, ట్రెజరర్‌కు 2, లేడీ రిప్రజెంటేటీవ్ అన్నపూర్ణ ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు చెప్పారు. సీనియర్ ఈసీ మెంబర్ నలుగురు, జూనియర్ ఈసీ మెంబర్లు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేసినట్లు తెలిపారు.
పాడిపరిశ్రమతో ఆర్థికాభివృద్ధి
బోయినపల్లి(చొప్పదండి): పాడిపరిశ్రమతో ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం మండలానికి చెందిన 56 మంది లబ్ధిదారులతో అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడిపరిశ్రమతో ఉపాధి పొందేందుకు ప్రభుత్వం రుణాలు అందిస్తుందన్నారు. అనంతరం పాడిగేదెల యూనిట్లకు ఎంపికై న లబ్ధిదారుల నుంచి ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు సేకరించారు. ఎంపీడీవో నల్లా రాజేందర్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి రమేశ్, ఎస్‌ఏ ఆరిఫ్ పాల్గొన్నారు.
‘డబుల్’ ఇళ్లు పూర్తి చేయండి
వీర్నపల్లి(సిరిసిల్ల): డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ ఆదేశించారు. మండలంలోని కంచర్ల, వీర్నపల్లి, ఎర్రగడ్డ గ్రామాల్లోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులను శుక్రవారం పరిశీలించారు. ఇసుక కొరత లేకుండా చూడాలని స్థానిక అధికారులను ఖీమ్యానాయక్ ఆదేశించారు. తహసీల్దార్ తఫాజుల్ హుస్సేన్, డీటీ ప్రవీణ్‌కుమార్, జెడ్పీటీసీ కళా వతి, ఎంపీపీ భూల, సెస్ డైరెక్టర్ మల్లేశం, సర్పంచ్ దినకర్, ఎంపీటీసీ ఫోరం అధ్యక్షుడు అరుణ్‌కుమార్ పాల్గొన్నారు.

ఇళ్లు పరిశీలిస్తున్న అదనపు కలెక్టర్