
సిరిసిల్ల తహసీల్దార్ ఆఫీస్ ముందు శిథిలమవుతున్న ప్రభుత్వ జీపులు
● శిథిలమైన జీపుల మొర
సిరిసిల్ల: రాత్రనకా.. పగలనకా.. రోడ్డున్నా.. లేకున్న.. ఎంతో మంది ఆఫీసర్లను మోశాం. ప్రతికూల పరిస్థితుల్లో మా సార్లను క్షేమంగా ఇళ్లకు చేర్చాం. మా ఒళ్లు హూనమైనా ఢొంక దారుల్లో కష్టాలను అనుభవిస్తూ.. ఆఫీసర్లతో కలిసి గమ్యాన్ని ముద్దాడాం. వేల కిలోమీటర్ల దూరం పరుగులు తీశాం. నా సామర్థ్యానికి మించి పదుల సంఖ్యలో మీ అందరిని మోసినం. నిజంగానే మలిసంధ్యలో అలసిపోయాం. ఇంతచేసిన మాపై దయలేకుండా ఇలా వదిలేశారు. చలికి వణుకుతూ ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ.. మా శరీర భాగాలను ఒక్కొక్కటిగా దొంగలు ఎత్తుకెళ్లినా.. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో పడి ఉన్నాం. ఇంతకీ మేము ఎవరో చెప్పనే లేదు కదా.. మీ కళ్లెదుట కనిపించే డొక్కు జీపులం. నిజమే వయసు ఉడిగిపోయిన డొక్కు.. తుప్పు పట్టిన బండ్లమే. దయగల తండ్రులారా.. మా మొరను ఆలకించుండ్రి..
సిరిసిల్ల పాత తాలూకా స్థాయిలో రెవెన్యూ అధికారుల వద్ద గర్వంగా పరుగులు పెట్టాం. అప్పట్లో మా దర్పం అంతా ఇంతా కాదు. మాకు చిన్నపాటి జబ్బు (రిపేరు) చేసినా వెంటనే ఆస్పత్రి(మెకానిక్ షెడ్డు)కి తీసుకెళ్లి వైద్యం(రిపేరు) చేయించేవారు. అప్పట్లో కడుపు నిండా తిండి(డీజిల్) ఉండేది. కానీ ఎన్ని రోజులు అని పనిచేస్తాం. నిజమే మాకు వయసు ఉడిగింది. కాళ్లు చేతులు దగ్గరపడ్డాయి. ఆరోగ్యం సహకరించడం లేదు. అంతే మమ్మల్ని మూలన పడేశారు. మా స్థానంలో ఇప్పుడు కొత్త కొత్త వాళ్లు(కార్లు) వచ్చారు. వాటిపై ఇప్పుడు మీరు పరుగులు తీస్తున్నారు. కానీ ఎంతోకాలం మీకు సేవచేసిన మమ్మల్ని మరిచిపోవడం భావ్యమా. పెద్ద సార్లు ఒక్కసారి ఆలకించుండ్రి మా మొరను. అవసాన దశలో మూలనపడిన మమ్మల్ని కనీసం తుక్కుగా అమ్మేయలేదు. ఇలా నిర్లక్ష్యంగా వదిలేయడం న్యాయమా.. చెప్పండి. స్వచ్ఛ భారత్ అంటూ.. పరిసరాల పరిశుభ్రత గురించి మాట్లాడే మీకు.. మేము చెత్తగా కూడా కనిపించడం లేదా..? మేమున్నది ఏ మారుమూల ప్రాంతమో కాదు.. సిరిసిల్ల జిల్లా నడిబొడ్డున తహసీల్దార్ ఆఫీస్ ముందే.. ఇలా లేవలేని స్థితిలో దీనావస్థలో ఉన్నాం. అయ్యా.. జిల్లా పెద్ద సార్లు.. మా బాధను అర్థం చేసుకుని మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగిస్తే మీకు పది వేల వందనాలు. కనీసం మేమున్న పరిసరాలు పరిశుభ్రంగా మారుతాయి. మాకు మోక్షం లభిస్తుంది. కొంచం ఆలోచించుండ్రి దొరలారా. లేకుంటే మీ నిర్లక్ష్యానికి అద్దం పడుతూ మేము ఇలాగే పడి ఉంటాం. ఇన్ని రోజులు మీకు సేవ చేసిన దురదృష్టాన్ని నిందించుకుంటూ ఈ మట్టిలోనే కలిసిపోతాం. ఇంతసేపు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మా తుప్పుపట్టిన.. కాలం చెల్లిన.. డొక్కు జీపుల మొరను ఆలకించిన మీ అందరికీ శనార్థులు.. ఇక ఉంటాను.
– ఇట్లు
మీ.. నోరు లేని మూలన పడిన సర్కారు జీపులం