
పోతుగల్ వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యాలయం
● ముగిసిన పాలకవర్గాల పదవీకాలం ● ఆశావహుల ఎదురుచూపులు ● మంత్రి కేటీఆర్ ఆశీస్సుల కోసం ప్రయత్నాలు
ముస్తాబాద్(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీకాలం ముగిసి మూడు నెలలు గడుస్తున్నాయి. కొత్తగా కమిటీలను నియమించకపోవడంతో ఆశావహులకు ఎదురుచూపులే దిక్కయ్యాయి. ఇప్పటికే పలు వురు మంత్రి కేటీఆర్ ఆశీస్సుల కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. సిరిసిల్ల నియోజకవర్గంలోని పోతుగల్, రాచర్లబొప్పాపూర్, గంభీరావుపేట, సిరిసిల్ల వ్యవసాయ మార్కెట్ కమిటీల పదవీకాలం గత డిసెంబర్ 26తో ముగిశాయి.
కమిటీలకు ప్రత్యేకాధికారులు
మార్కెట్ కమిటీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులను నియమించింది. కమిటీల పర్యవేక్షణ సరిగ్గా లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా చెక్‌పోస్టుల వద్ద సరైన తనిఖీలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. సెక్యూరిటీగార్డులకు చెక్‌పోస్టులను వదిలి ఎలాంటి పర్యవేక్షణ చేయడం లేదని తెలుస్తోంది. పొరుగు జిల్లాలతోపాటు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి తరలిపోతున్న వ్యవసాయ ఉత్పత్తులకు సరైన మార్కెట్ ఫీజులు వసూలు చేయడం లేదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అధికార బీఆర్‌ఎస్ నాయకులు కమిటీలను నియమించాల్సిన అవసరం ఉందని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.
తీవ్రమైన పోటీ
త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని భావి స్తున్న తరుణంలో మార్కెట్ కమిటీల నామినేటెడ్ పోస్టుల కోసం పోటీ నెలకొంది. సాధారణ ఎన్నికల అనంతరం లోక్‌సభ, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా జరుగనున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌లో సీనియర్ నాయకులతోపాటు పార్టీకి, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలనే ఆలోచనలో మంత్రి ఉన్నట్లు భావిస్తున్నారు. ఇప్పటికే ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, తంగళ్లపల్లి మండలాల నుంచి ఆశావహుల జాబితా కేటీఆర్‌కు చేరినట్లు సమాచారం. సెస్ ఎన్నికల విజయంలో పనిచేసిన నాయకులకు, పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న వారిని పదవులు వరిస్తాయని భావిస్తున్నారు. అయితే ఎవరికి వారు మంత్రి కేటీఆర్ ఆశీస్సులు పొందేందుకు నాయకులు ప్రయత్నాలు మొదలుపెట్టారు. చైర్మన్లతోపాటు వైస్‌చైర్మన్లు, డైరెక్టర్ పదవులతో 50 మంది వరకు నామినేటెడ్ పదవులు పొందనున్నారు. ఈమేరకు ఏప్రిల్‌లో కమిటీల నియామకం ఉంటుందని తెలుస్తోంది.
కమిటీల బలోపేతంపై దృష్టి
వ్యవసాయ మార్కెట్ కమిటీలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. రైతుల ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించేలా, మార్కెట్ ఫీజులు పక్కదారి పట్టకుండా చేసే చర్యలను తీసుకోనున్నారు. కొనుగోలు కేంద్రాల్లో అన్ని వసతులు కల్పి స్తూ మార్కెట్ యార్డులలో రైతు ఉత్పత్తులకు సౌకర్యాలు కల్పించనున్నారు. గోదాముల నిర్మాణాలు చేపట్టడం, ధాన్యం ఆరబోసేందుకు ప్లాట్‌ఫామ్‌ల నిర్మాణాలు, రైతు విశ్రాంతి గదులు, స్నానాల గదులు ఆధునికీకరించాల్సి ఉంది. ధాన్యం తేమశాతం చూసే యంత్రాలు, వెయింగ్ మిషన్లు, జాలీపట్టే యంత్రాల నిర్వహణ వంటి పనులు ఇంకా చేపట్టాల్సి ఉంది.