టంగుటూరుతోపాటు పరిసర మండలాల్లో సుమారు 800 మిలియన్ టన్నుల మాగ్నటైట్ నిక్షేపాలు భూగర్భంలో ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, రాష్ట్ర గనుల శాఖ పరిశోధనల్లో తేలింది. ఇక్కడ లభ్యమయ్యే మాగ్నటైట్ రకానికి చెందిన ముడి ఖనిజంలో సహజంగా ఇనుము శాతం కొంత తక్కువగా అంటే సుమారు 18 నుంచి 30 శాతం వరకు ఉంటుందని అంచనా. తక్కువ గ్రేడ్ ఖనిజం అయినప్పటికీ, అధునాతన టెక్నాలజీ ద్వారా మలినాలు తొలగించి, ఇనుము శాతాన్ని పెంచి స్టీల్ తయారీకి వినియోగించేందుకు జేఎస్‌డబ్ల్యూ సిద్ధమైంది. లోగ్రేడ్ ఇనుప ఖనిజాన్ని హైగ్రేడ్‌గా మార్చడం కోసం ఉక్కు దిగ్గజం జేఎస్‌డబ్ల్యూతో ఏపీఎండీసీ చేతులు కలిపింది. ఎంఓయూ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం 1300 ఎకరాల భూమిని జేఎస్‌డబ్ల్యూకు కట్టబెట్టింది. ఈ పరిణామం టంగుటూరు, వలేటివారిపాలెం తదితర మండలాల్లో ప్రజలను ఆందోళనలోకి నెట్టింది. ఇనుము శుద్ధి కర్మాగారంలో ఏటా 5 మిలియన్ టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేయాలని జేఎస్‌డబ్ల్యూ భావిస్తుండగా.. ఇది పర్యావరణానికి, పంటల సాగుకు, భూగర్భ జలాలకు తీవ్ర ముప్పు కలిగిస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


