కక్ష సాధింపులు పరాకాష్టకు.. | - | Sakshi
Sakshi News home page

కక్ష సాధింపులు పరాకాష్టకు..

May 1 2026 7:56 AM | Updated on May 1 2026 7:56 AM

రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించేలా చంద్రబాబు పరిపాలన పోలీస్‌ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు ఆదిమూలపు సురేష్‌

కొండపి: చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలన పూర్తిగా గాడితప్పిందని వైఎస్సార్‌ సీపీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ విమర్శించారు. గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని ప్రజల సమస్యలు పరిష్కరించకుండా డైవర్షన్‌ పాలిటిక్స్‌తో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వాటి గురించి ప్రశ్నిస్తున్న గొంతుకలు నొక్కే ప్రయత్నం మాత్రమే చేస్తోందన్నారు. ముఖ్యంగా ప్రశ్నించే ప్రతిపక్షాలపై కక్ష సాధించే ప్రయత్నాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. పోలీస్‌ వ్యవస్థ పనితీరు ఎప్పుడో గాడితప్పిందని విమర్శించారు. చట్టపరంగా వేధింపులు, అంతకుమించి బహిరంగంగా బెదిరింపులతో పోలీసు వ్యవస్థ నవ్వుల పాలయ్యే పరిస్థితికి చేరిందన్నారు. వైఎస్సార్‌ సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి ఉదంతమే అందుకు నిదర్శనమని ఆదిమూలపు సురేష్‌ పేర్కొన్నారు. 15 రోజుల క్రితం అతన్ని ఎందుకు అరెస్టు చేశారో ఎవరికీ తెలియదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా అరెస్టు చేశారని విమర్శించారు. అరెస్టు చేసిన తర్వాత కుప్పం కోర్టుకు రిమాండ్‌కు తీసుకెళ్తే.. చివరికి కోర్టే రిమాండ్‌ను తిరస్కరించిందని, వెంటనే పోలీసులు హైకోర్టును ఆశ్రయించారని వివరించారు. పోలీసులే టీడీపీ కార్యకర్తల్లా ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కుప్పం కోర్టు ఉత్తర్వులను హైకోర్టు నిలుపుదల చేయగా, మళ్లీ వెంటపడి బెంగళూరులో అతన్ని అరెస్టు చేశారన్నారు. గురువారం కుప్పం కోర్టు బెయిల్‌ మంజూరు చేసినా కక్షపూరితంగా పేరు మార్చి అదే కేసుతో అతన్ని వేధింపులకు గురిచేయడం వంటివి చూస్తుంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ శ్రీహరిని బయటకు రానివ్వకుండా చేయాలన్నది కూటమి ప్రభుత్వం ఉద్దేశమని అర్థమవుతోందన్నారు. విజయవాడలో సోషల్‌ మీడియా కార్యకర్త కరీముల్లా తన షాప్‌నకు ఎదురుగా టీడీపీ ఫ్లెక్సీలు కట్టవద్దన్నందుకు అక్రమ కేసులు బనాయించారని, సాక్షి టీవీ రిపోర్టర్‌పై అన్యాయంగా దాడి చేసి గాయపరిచారని ధ్వజమెత్తారు. దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని డిమాండ్‌ చేశారు. కూటమి ప్రభుత్వం చట్టాలను చేతిలోకి తీసుకుని వ్యవస్థను మేనేజ్‌ చేస్తోందన్నారు. రాష్ట్రంలో డీజిల్‌ సమస్య పెరిగి కూరగాయల ధరలు అమాంతం పెరిగాయన్నారు. రైతాంగం పడుతున్న ఇబ్బందులకు సమాధానం చెప్పలేక అక్రమ కేసులతో ప్రజలను పాలకులు డైవర్షన్‌ చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలన పూర్తిగా ఎమర్జెన్సీ రోజులను తలపిస్తోందని ఆదిమూలపు సురేష్‌ ఆందోళన వ్యక్తం చేశారు. తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, తప్పక విజయం సాధిస్తామఽఽని ధీమా వ్యక్తం చేశారు. రెడ్‌ బుక్‌ రాజ్యాంగానికి బెదిరేది లేదని, తమ నాయకులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ధైర్యంతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం, పోలీస్‌ వ్యవస్థ అక్రమ కేసులు విత్‌ డ్రా చేసుకోవాలని, లేనిపక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement
 
Advertisement
Advertisement