విద్యారంగ పరిరక్షణకు పెద్ద ఎత్తున పోరాటం
● యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు
ఒంగోలు సిటీ: పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, లేకుంటే ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణకు పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు అన్నారు. యూటీఎఫ్ జిల్లా కౌన్సిల్ సమావేశం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై అధ్యక్షతన ఒంగోలు టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 12వ పీఆర్‌సీ కమిషన్‌ను ప్రభుత్వం వెంటనే వేయాలన్నారు. ఆర్థిక బకాయిలకు సంబంధించి రూట్‌మ్యాప్ ప్రకటించాలని, 11వ పీఆర్‌సీ బకాయిలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు సైతం ఒక గంట అదనంగా పనిచేసి ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాలన్నారు. తల్లికి వందనం ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తింపజేయాలని, తెలుగు ఇంగ్లిష్ మీడియంకు సమాంతరంగా ప్రవేశపెట్టాలన్నారు. టెట్ పరీక్షలు ప్రభుత్వ ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వా లని కోరారు. మున్సిపాలిటీ ఉపాధ్యాయులకు పీఎఫ్ సౌకర్యాన్ని కల్పించాలని, జెడ్పీ పీఎఫ్ కార్యాలయంలో నెలల తరబడి నోచుకొని బిల్లు చెల్లించాలని, మౌలిక సదుపాయాలు కల్పించి పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని, విద్యాహక్కు చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా ఉపాధ్యాయులకు వేతనంతో కూడిన రెండేళ్ల చైల్డ్‌కేర్ లీవ్‌ను, హెల్త్‌కార్డ్ ద్వారా నాణ్యమైన నగదు రహిత వైద్యం అందించాలని, ఉపాధ్యాయులకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే పాఠశాలలు నిర్వహించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా కమిటీ, మార్కాపురం జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారులుగా యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జీవీ రమణ, నవకోటేశ్వరరావు పాల్గొని ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. ప్రకాశం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కిలారి వెంకటేశ్వర్లు, షేక్ అబ్దుల్ హై, సహోధ్యక్షులుగా వై.వెంకటరావు, సహోధ్యక్షురాలుగా జి.ఉమామహేశ్వరి, కోశాధికారిగా ఎన్. చిన్నస్వామి ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మార్కాపురం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా షేక్ ఖాజా రహమతుల్లా, ఓవీ వీరారెడ్డి, సహోధ్యక్షులు బాల వెంకటేశ్వర్లు, కోశాధికారిగా బి.శ్రీరాములులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల ప్రక్రియను యూటీఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శ్రీనివాసరావు పర్యవేక్షించారు. యూటీఎఫ్ పూర్వ రాష్ట్ర కార్యదర్శి మేగడ వెంకటేశ్వర్‌రెడ్డి, జీవీ శేషయ్య తదితరులు పాల్గొన్నారు.
కిలారి వెంకటేశ్వర్లు
షేక్ అబ్ధుల్ హై
విద్యారంగ పరిరక్షణకు పెద్ద ఎత్తున పోరాటం
విద్యారంగ పరిరక్షణకు పెద్ద ఎత్తున పోరాటం


