రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
గుంటూరు రూరల్: ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటన గుంటూరు నగరంలోని నల్లపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. సీఐ వంశీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరం గ్రామానికి చెందిన చాట్ల నాని (16), చాట్ల అభిషేక్ (17) ఆదివారం ఉదయం పెదకాకాని సమీపంలోని ఓ ప్రార్థనా మందిరానికి ద్విచక్రవాహనంపై వచ్చారు. అక్కడ ప్రార్థనలు ముగించుకుని తిరిగి సాయంత్రం సమయంలో ద్విచక్రవాహనంపై ఇంటికి బయలుదేరాగా రూరల్ మండలం దాసరిపాలెం సమీపంలో ద్విచక్రవాహనం నేషనల్ హైవేపై డివైడర్‌ను ఢీకొంది. తీవ్రగాయాలతో సంఘటనా స్థలంలోనే మృత్యువాత పడ్డారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఽఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతుల వద్ద ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం


