అనుమానాస్పద స్థితిలో ఎలక్ట్రీషియన్ మృతి
ఒంగోలు టౌన్: నగరానికి చెందిన ఒక ఎలక్ట్రీషీయన్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం..నగరంలోని ప్రకాశం కాలనీకి చెందిన షేక్ సుల్తాన్ బాష (35) గుంటూరు రోడ్డులో ఆటో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. కొంత కాలంగా వెంకటేశ్వరనగర్‌కు చెందిన దార్ల రజనీ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయమై గతంలో ఒకసారి సుల్తాన్ బాష భార్య తాలుకా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారిని పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ క్రమంలో శనివారం రాత్రి బాష వెంకటేశ్వర నగర్‌లోని రజనీ నివాసానికి వెళ్లాడు. ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ తెల్లవారేసరికి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నాడు. వెంటనే రజనీ అతడ్ని జీజీహెచ్‌కు తరలించింది. అప్పటికే సుల్తాన్ బాష మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం తెలుసుకున్న సుల్తాన్ బాష కుటుంబసభ్యులు పెద్ద సంఖ్యలో జీజీహెచ్ వద్దకు తరలివచ్చారు. బాష మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అతడు ఉరేసుకొని మృతి చెందలేదని, హత్య చేసి ఉంటారని ఆరోపించారు. తాలుకా పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.


