సచివాలయ ఉద్యోగులకు చలానాలు
● విధులకు గైర్హాజరైన ఉద్యోగుల నుంచి ఆయా రోజులకు వేతనాన్ని లెక్కించి చలానా కట్టించాలని ఎంపీడీఓ ఆదేశాలు
మద్దిపాడు:
అధికారికంగా సెలవు పెట్టకుండా విధులకు గైర్హాజరైన సచివాలయ ఉద్యోగులకు చలానాలు విధిస్తూ మద్దిపాడు ఎంపీడీఓ వి.జ్యోతి ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆ వివరాల్లోకెళ్తే.. మద్దిపాడు మండలంలోని దొడ్డవరం సచివాలయాన్ని ఇటీవల జీఎస్‌డబ్ల్యూఎస్ డిప్యూటీ ఎంపీడీఓ హరిప్రసాద్ పరిశీలించారు. ఇప్పటి వరకూ ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వేలన్నింటిలో దొడ్డవరం సచివాలయం వెనుకబడి ఉండటం, అక్కడి ఉద్యోగుల పనితీరు బాగలేకపోవడం, ఉద్యోగులు అనధికారికంగా విధులకు గైర్హాజరు కావడాన్ని గుర్తించారు. వీటన్నింటిపై ఎంపీడీఓకు ఆయన రిపోర్ట్ చేశారు. ఈ నేపథ్యంలో దొడ్డవరం సచివాలయ ఉద్యోగులను శనివారం ఉదయం మద్దిపాడులోని మండల పరిషత్ కార్యాలయానికి పిలిపించి ఎంపీడీఓ జ్యోతి మాట్లాడారు. సచివాలయం పరిధిలో సర్వేలు పూర్తి చేయకుండా ఉద్యోగులు కుంటిసాకులు చెప్పడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 15వ తేదీలోపు సర్వేలు మొత్తం పూర్తిచేయాలని, లేకపోతే జీతాలు నిలిపివేస్తానని హెచ్చరించారు. రెండు నెలలుగా వారి అటెండెన్స్‌ను ఆన్‌లైన్‌లో పరిశీలించారు. అధికారికంగా సెలవు తీసుకోకుండా విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై అసహనం వ్యక్తం చేశారు. ఈ విధంగా వారు ఎన్నిరోజులు విధులకు హాజరుకాలేదో తెలుసుకుని ఆయా రోజులకు సంబంధించి వారి వేతనాన్ని లెక్కించి ఆ డబ్బును వారితోనే చలానాల రూపంలో ప్రభుత్వానికి కట్టించాలని డిప్యూటీ ఎంపీడీఓకు ఆమె సూచించారు. ఆ మేరకు ఉత్తర్వులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. సచివాలయ ఉద్యోగులు క్షమశిక్షణతో పనిచేయాలని ఆమె స్పష్టం చేశారు. అటు ప్రజలకు.. ఇటు అధికారులకు అందుబాటులో ఉంటూ విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.


