మద్యం విక్రయాలను నియంత్రించాలి
ఒంగోలు టౌన్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మద్యం విక్రయాలు విపరీతంగా జరిగే అవ కాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా మ ద్యం విక్రయాలను నియంత్రించాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల రమాదేవి డిమాండ్ చేశారు. స్థానిక ఎల్బీజీ భవనంలో శనివారం ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కంకణాల రమాదేవి మాట్లాడుతూ ఈ నెల 30, 31, జనవరి 1 తేదీల్లో మద్యం విక్రయాల సమయాలను సవరించాలని, రాత్రి 7 గంటలకే దుకాణాలు మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ప్రతి ఏడాది పగలూరాత్రి తేడా లేకుండా మద్యం దుకాణాలు తెరిచి ఉంచుతున్నారన్నారు. దీంతో పీకలదాకా మద్యం సేవించి రోడ్ల మీద విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తాగిన మైకంలో గొడవలకు దిగడమే కాకుండా మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని చెప్పారు. నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా రోడ్డు ప్రమాదాలు జరగడం షరామామూలై పోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, వీధివీధికీ బడ్డీకొట్లలో సైతం మద్యం విక్రయాలు జరుగుతున్నా ప్రభుత్వం చూసీచూడనట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని చెప్పారు. బెల్ట్ షాపులను నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం దుర్మార్గమన్నారు. మరోవైపు రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి విక్రయాలు జరుగుతున్నాయని, వీటిని సేవించిన యువత భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. గంజాయి విక్రేతలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సమావేశానికి జిల్లా నాయకురాలు సయ్యద్ షమ్మి అధ్యక్షత వహించగా ఎన్.మాలతి, జి.ఆదిలక్ష్మి, రాజేశ్వరి, రంగమ్మ, బుజ్జి, మస్తానమ్మ, జి.అరుణ పాల్గొన్నారు.


