చిల్లకర్ర తరలిస్తున్న ట్రాక్టర్లు సీజ్
పొన్నలూరు: మండలంలోని చెరుకూరు రెవెన్యూ పరిధి సర్వే నంబర్ 787లో ప్రభుత్వ భూమి ఉంది. ఆ ప్రభుత్వ భూమిలో కొన్నేళ్లుగా ఉన్న చిల్లకర్రపై కొందరి అక్రమార్కుల కన్ను పడింది. గుట్టు చప్పుడు కాకుండా అక్రమార్కులు టన్నుల కొద్దీ చిల్ల కర్రను కొట్టి ట్రాక్టర్లలో తరలిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం కొందరు గ్రామస్తులు రెవెన్యూ అధికారులకు సమాచారం ఇచ్చారు. తహసీల్దార్ పుల్లారావు స్పందించి అక్రమంగా చిల్లకర్ర తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నారు. ఆ తర్వాత వాటిని తహసీల్దార్ కార్యాలయానికి తరలించి సీజ్ చేశారు. అనుమతి లేకుండా ప్రభుత్వ భూముల్లో చిల్లకర్ర కొట్టి తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తహసీల్దార్ హెచ్చరించారు.


