ఒంగోలులో పోలీసుల తనిఖీలు
ఒంగోలు టౌన్: పండుగల సీజన్ కావడంతో పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఎస్పీ హర్షవర్థన్‌రాజు ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు ఒంగోలు నగరంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలో రద్దీ ఎక్కువగా వుండే ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్ పరిసరాలలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. పేలుడు పదార్థాలు కనుగొనే చీతా జాగిలం, బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. అనుమానాస్పద వస్తువులు, లగేజీలను తనిఖీ చేశారు. అనుమానం ఉన్న ప్రయాణికుల బ్యాగులు తనిఖీ చేశారు. బస్టాండు, రైల్వే స్టేషన్లలో అనుమానాస్పద వస్తువులు కనిపించినా, పార్శిళ్లు కంటపడినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. నిరంతరం నిఘా ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తనిఖీలలో ఆర్‌ఎస్‌ఐ ప్రసాద్, డాగ్ హ్యాండ్లర్ ప్రభాకర్ పాల్గొన్నారు.


