పొగబెట్టినారు.!
జిల్లాలో సుమారు 62 వేల హెక్టార్లలో పొగాకు సాగు 90.20 మిలియన్ కిలోల పంటకు పొగాకు బోర్డు అనుమతి జిల్లాలో సుమారు 3 వేల ఎకరాల్లో పొగనారుమళ్ల సాగు ఆరంభంలో నారు మూట రూ.7 వేలు ప్రస్తుతం ధర రూ.1,000 నుంచి రూ.2,000 మాత్రమే సుమారు 85 శాతం పొగనాట్లు పూర్తి దొడ్లలో భారీగా ఉన్న పొగనారు.. ఆందోళనలో రైతులు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:
పొగాకు బోర్డు ఒంగోలు రీజియన్ పరిధిలో 11 పొగాకు వేలం కేంద్రాలున్నాయి. 2024–25 పంట కాలంలో 104.6 మిలియన్ కేజీల పొగాకు పండించేందుకు బోర్డు అనుమతి ఉంది. అయితే నాలుగేళ్లుగా వస్తున్న లాభాలతో ఈ ఏడాది పొగాకు సాగువైపు రైతులు అధికంగా మొగ్గు చూపారు. సాగు సమయంలో కంపెనీలు సైతం అదనపు సాగువైపు రైతులను పురిగొల్పాయి. ఫలితంగా పరిమితిని మించి 158.6 మిలియన్ కేజీల వరకు పొగాకు ఉత్పత్తులు రావచ్చని బోర్డు అధికారులు అంచనా వేశారు. దాదాపు 54 మిలియన్ కేజీల వరకు బోర్డు అనుమతికి మించి అదనపు పొగాకు పండింది. అయితే వేలం ప్రారంభంలో మంచి ధరలు వచ్చినా రానురాను పడిపోయాయి. రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రాలేదు. కంపెనీలు కుమ్మకై ్క రైతులను ముంచేశాయని, వారికి బోర్డు అధికారులు వంతపాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం కొనుగోళ్లు చివరి దశకు చేరుకున్నాయి. 2025–26 సీజన్‌కు సంబంధించి మొత్తం 90 మిలియన్ కేజీలు మాత్రమే సాగు చేయాలని బోర్డు పరిమితి విధించింది. ఎస్‌ఎల్‌ఎస్ పరిధిలో 48.1 మిలియన్ కేజీలు, ఎస్‌బీఎస్ పరిధిలో 42.1 మిలియన్ కేజీలు సాగుచేయాల్సి ఉంది. దీనికి సంబంధించి నాట్లు ప్రారంభమయ్యాయి. దాదాపు 2500 ఎకరాల నుంచి 3000 ఎకరాల్లో నారు సాగుచేస్తున్నారు. రీజియన్ పరిధిలో 11 వేలం కేంద్రాలు ఉండగా, సుమారు 25 వేల బ్యారన్‌లకు రైతులు లైసెన్స్‌లు కలిగి ఉన్నారు. 62 వేల హెక్టార్లలో పొగాకు సాగులో ఉంది.
నారు సమయం నుంచే కష్టాలు..
పొగాకు నారు సాగుచేసే సమయం నుంచే రైతులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. జిల్లాలో 2500 నుంచి 3000 ఎకరాల్లో పొగాకు నారు సాగుచేస్తున్నారు. వరుస తుఫాన్ల కారణంగా నాట్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మోంథా తుఫాన్‌కు ముందు పొగనారుమళ్లు సాగుచేసిన రైతులకు భారీగా లాభాలు వచ్చాయి. దిత్వా తుఫాన్ మరికొందరు రైతులకు నష్టాలు మిగిల్చింది. తెల్ల నేలల్లో అక్టోబర్‌లో పొగనాట్లు పూర్తి కావాల్సి ఉండగా.. నల్లరేగడి నేలల్లో నవంబర్ నుంచి డిసెంబర్ వరకు పొగనాట్లు పూర్తవుతాయి. తుఫాన్ల కారణంగా నారుదొడ్లు సాగు చేసే రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మోంథా తుఫాన్ ప్రభావంతో నారుదొడ్లు చాలా వరకు ధ్వంసం కాగా రైతులు భారీగా నష్టపోయారు. ఆ తర్వాత పొగనారుకు డిమాండ్ ఏర్పడటంతో నారుమూట ధరలు రూ.2,000 నుంచి ఒక్కసారిగా రూ.5 వేల నుంచి రూ.7 వేల వరకు పెరిగాయి. దీంతో నారుమళ్లు సాగుచేసుకున్న రైతులు భారీగా లాభాలు ఆర్జించారు. దీంతో రైతులు భారీగా నారుమళ్లు సాగు చేశారు.
నారు ధరలు పడిపోయాయి..
2.50 ఎకరాల్లో పొగాకు నారుమళ్లు సాగు చేశా. ఎకరాకు సుమారు రూ.2.50 లక్షలు ఖర్చు కాగా, సుమారు 200 నుంచి 250 మూటలు దిగుబడి వస్తుంది. మోంథా తుఫాన్ కారణంగా వేసిన నారుదొడ్డి దాదాపు పాడైంది. తిరిగి నారుమళ్లు సాగుచేశా. మొదట్లో నారు మూట ధర రూ.7 వేలు ఉండగా ప్రస్తుతం నారు అందుబాటులోకి వచ్చేసరికి ధర రూ.2 వేలకు పతనమైంది. నారుమూట ధర రూ.2,500 ఉంటే తప్ప గిట్టుబాటు కాదు. ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోంది.
– తానికొండ రామచంద్రరావు, రైతు, పచ్చవ
మోంథాతో నష్టం..
ఒకటిన్నర ఎకరాలో పొగాకు నారుమళ్లు సాగు చేశా. మోంథా తుఫాన్ కారణంగా నారుమళ్లలో నీరు నిలిచి పూర్తిగా నష్టపోయా. సుమారు రూ.2.50 లక్షలు నష్టమొచ్చింది. తిరిగి నారుమళ్లు సాగు చేస్తే ఇప్పుడు ధరలు తక్కువగా ఉన్నాయి.
– ముళ్లమూరి శ్రీనివాసరావు, రైతు, పచ్చవ
నారుకు తగ్గిన డిమాండ్...
ఆరంభంలో ఎక్కువ ధరలు రావడంతో రైతులు పెద్ద ఎత్తున నారు సాగు చేశారు. ఒక్కసారిగా నారు ఎక్కువగా రావటంతో డిమాండ్ తగ్గిపోయింది. దీనికితోడు పొగనాట్లు దాదాపుగా పూర్తవడంతో పొగనారుకు డిమాండ్ భారీగా తగ్గింది. ప్రస్తుతం ఽముదురు నారు ధర రూ.వెయ్యి ఉండగా, లేత నారు ధర రూ.2,000 పలుకుతోంది. వాస్తవానికి నారుమూట ధర రూ.2,500 ఉంటే తప్ప గిట్టుబాటయ్యే పరిస్థితి లేదు. ఒక నారు మూటను కూలీలు కట్టాలంటే రూ.350 ఖర్చవుతుందని రైతులు చెబుతున్నారు. ఎకరా నారుదొడ్డి సాగు చేస్తే సుమారు 200 నుంచి 250 రూపాయల వరకు నారుమూటలు దిగుబడి వస్తాయి. ఒక ఎకరా నారు దొడ్డి సాగు చేయడానికి సుమారు రూ.2 లక్షల నుంచి రూ.2.50 లక్షలు ఖర్చవుతుంది. ఈ సంవత్సరం పొగనారుమళ్లు సాగు చేసిన రైతులు కొంతమంది రూ.లక్షల్లో లాభాలు ఆర్జించగా, మరికొందరు ఆర్థికంగా నష్టపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా నాణ్యమైన నారును పొరుగు ప్రాంతాల నుంచి తెచ్చుకుంటుండడంతో స్థానికంగా లభ్యమయ్యే నారు ధరలు పతనానికి మరో కారణంగా నిలుస్తున్నాయి. ఇదిలా ఉండగా సంబంధిత శాఖ అధికారులుగానీ, బోర్డు అధికారులుగానీ రైతులకు అవగాహన కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పొగబెట్టినారు.!


