సెలవు రోజుల్లో తరగతులు రద్దు చేయాలి
● యూటీఎఫ్ జిల్లా శాఖ డిమాండ్
ఒంగోలు సిటీ: ఎస్‌ఎస్‌సీ వంద రోజులు ప్రోగ్రాంలో విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆదివారాలు, సెలవు రోజుల్లో తరగతులు రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కొమ్మోజు శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ జిల్లా శాఖ అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్ వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ 2010కి ముందు చేరిన సీనియర్ టీచర్లకు టెట్ రద్దు చేయాలని, ఆ మేరకు విద్యా హక్కు చట్టాన్ని సవరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని కోరారు. ఎఫ్‌ఎల్‌ఎన్ 75 రోజుల ప్రోగ్రాం అమల్లో కూడా విద్యార్థులకు రాని అంశాలను వారికి స్వేచ్ఛగా నేర్పించే అవకాశం కల్పించాలన్నారు. సింగిల్ టీచర్లు సెలవుల విషయంలో ఓహెచ్‌లు ఉపయోగించుకునేందుకు పడుతున్న ఇబ్బందులు తొలగించాలన్నారు. గురుకుల సంక్షేమ పాఠశాలలో ఉపాధ్యాయులపై ఆ శాఖ ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి అధికారుల వరకు వ్యవహరిస్తున్న తీరు మార్చుకోవాలన్నారు. జిల్లాలో కొన్ని మండలాల్లో టీచర్ల పట్ల ప్రత్యేకించి మహిళా ఉపాధ్యాయుల పట్ల ఎంఈఓలు వ్యవహరిస్తున్న తీరు సరిచేసుకోవాలన్నారు. జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ హై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సుమారు 30 వేల కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్ పెట్టిందన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఐఆర్ 30 శాతం ప్రకటించాలని, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన సరెండర్ లీవ్, ఆర్థిక బకాయిలకు సంబంధించిన షెడ్యూల్ ప్రకటించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వీరాంజనేయులు మాట్లాడుతూ ఎఫ్‌ఎల్‌ఎన్ 100 రోజుల ప్రోగ్రాం పర్యవేక్షణకు విద్యాశాఖ అధికారులు కాకుండా వేరే డిపార్ట్‌మెంట్ వారిని నియమించడాన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు. అదే విధంగా ఉపాధ్యాయుల మీద మానసిక ఒత్తిడి పెంచుతూ ఆదేశాలు ఇవ్వడం సరికాదన్నారు. ధర్నా అనంతరం డీఈఓ కార్యాలయంలో ఏడీ శ్రీనివాసరెడ్డికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, కే వెంకయ్య, ఎం.సంధ్యారాణి, సీహెచ్ ప్రభాకర్‌రెడ్డి, కిలారి వెంకటేశ్వర్లు, పాలపర్తి రామాంజనేయులు, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవీ శేష య్య, నాయకులు వైవీ వెంకట్రావు, ఆర్.నారాయణ, రమణమూర్తి, తాత వెంకటేశ్వర్లు, ఎం.మాలకొండయ్య, సుధాకర్‌రావు, దార్ల శ్రీనివాసరావు, దామ కొండపనాయుడు, బి.భాస్కరరావు పాల్గొన్నారు.


