ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి
మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడపాలి లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త ఉద్యమం జిల్లా కార్యదర్శి నారాయణ హెచ్చరిక
హాజరైన సీపీఐ శ్రేణులు, ప్రజలు
కార్యక్రమంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ
మార్కాపురం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జీవోను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని, వాటిని ప్రభుత్వమే నడపాలని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎంఎల్ నారాయణ డిమాండ్ చేశారు. లేకుంటే సీపీఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ విధానం పేరుతో మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడాన్ని నిరసిస్తూ మార్కాపురం మెడికల్ కళాశాల వద్ద సీపీఐ ఆధ్వర్యంలో గురువారం వంటావార్పు, ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. సీపీఐ జిల్లా కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆనాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేయగా, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని అన్నారు. 2.70 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఐదారు వేల కోట్ల రూపాయలను మెడికల్ కళాశాలలు కట్టేందుకు కేటాయించలేదా.? అని ప్రశ్నించారు. వెనుకబడిన పశ్చిమ ప్రకాశానికి మెడికల్ కాలేజీ ఒక వరమని, ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటరావు మాట్లాడుతూ విద్య, వైద్యాన్ని ప్రజలకు ఉచితంగా అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని అన్నారు. ముఖ్యమైన బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకోవడం దారుణమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు అందె నాసరయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని, ఉద్యమాలను, ప్రజల మనోభావాలను చంద్రబాబు ప్రభుత్వం గుర్తించి తక్షణమే ప్రైవేటీకరణ జీవోను ఉపసంహరిచుకోవాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామంటూ చివరికి అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎస్‌కే ఖాశీం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కేవీ కృష్ణగౌడ్, ఎస్‌కే యాసీన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏఐవైఎఫ్ యువజన మాస పత్రికను రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, కరుణానిధి తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణ ఉపసంహరించుకోవాలి


