పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దాం
● 104 వాహనాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్ కుమార్
మద్దిపాడు: రెండు పోలియో చుక్కలు వేసి పోలియో రహిత సమాజాన్ని నిర్మిద్దామని 104 వాహనాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ శ్రవణ్‌కుమార్ కోరారు. పల్స్ పోలియో కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ మద్దిపాడు బస్టాండ్ సెంటర్‌లో గురువారం మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ డిసెంబర్ 21వ తేదీ తలపెట్టిన పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని జయప్రదం చేసి పోలియో రహిత సమాజాన్ని సాధిద్దామన్నారు. ఈ నెల 23వ తేదీ వరకు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందన్నారు. మొదటి రోజు అప్పుడే పుట్టిన శిశువు నుంచి 5 సంవత్సరాల్లోపు పిల్లలకు పోలియో చుక్కలు వేస్తామన్నారు. ఆ రోజు పోలియో చుక్కలు వేయించుకోని వారికి 22, 23, తేదీల్లో ఆశ, అంగనవాడీ, ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వేస్తారని తెలిపారు. అనంతరం వారి ఇంటికి మార్కింగ్ చేస్తారన్నారు. మద్దిపాడు పీహెచ్‌సీ పరిధిలో 37 బూత్‌లు, 3 రూట్లు, 2 మొబైల్ టీంలు ఏర్పాటు చేశామన్నారు. సమస్యాత్మక ప్రదేశాలు.. అనగా ఇటుక బట్టీలు, సంచార జాతులు, మురికివాడలు, వలసలు ఉన్న పిల్లలకు ఆయా రూట్ సూపర్‌వైజర్లు పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 5,574 మంది 0 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు పోలియో చుక్కలు వేయనున్నట్లు తెలిపారు. తల్లిదండ్రులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థలు సహకరించి పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి పోలియో వ్యాధి లేని భారతంలో భాగస్వాములు కావాలని కోరారు. మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి వైద్య శాఖ సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు. ముందుగా పీహెచ్‌సీలోని సమావేశ మందిరంలో డాక్టర్ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఆశ, అంగన్‌వాడీ, ఆరోగ్య, స్వచ్ఛంద సంస్థల వలంటీర్లు, ఎంఎల్‌హెచ్‌పీలకు పల్స్ పోలియోపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ అన్వేష్ కుమార్, డాక్టర్ వినీల చౌదరి, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రజిత కుమారి, సీనియర్ అసిస్టెంట్ శాంతకుమారి, సూపర్‌వైజర్ బాలకోటయ్య, నాగరాజి, పద్మావతి సిబ్బంది పాల్గొన్నారు.


