220 కేవీ విద్యుత్ టవర్‌కు పొంచి ఉన్న ముప్పు
మార్కాపురం: మార్కాపురం ప్రాంతంలో మట్టి మాఫియా చెలరేగుతోంది. మట్టి అక్రమ తవ్వకాలతో దరిమడుగు వద్ద 220 కేవీ విద్యుత్ టవర్ కూలిపోయే ప్రమాదం ఏర్పడింది. గ్రామ సమీపంలోని సుబానీ కుంటలో గుండా 220 కేవీ విద్యుత్ లైన్ టవర్లు వెళ్తుండగా, దరిమడుగు వద్ద 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచే డివిజన్‌లోని మార్కాపురం, తర్లుపాడు, పొదిలి, కంభం, అర్ధవీడు, బేస్తవారపేట, గిద్దలూరు తదితర ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. అయితే కుంటలో ఉన్న మట్టిని మట్టిని కొందరు అక్రమంగా ట్రాక్టర్లు, టిప్పర్లలో తరలించారు. దీంతో 220 కేవీ విద్యుత్ టవర్‌కు ముప్పు ఏర్పడింది. ఇటీవల కురిసన వర్షాలకు కుంటలో నీరు చేరడంతో టవర్ చుట్టూ ఉన్న కొద్దిపాటి మట్టి కూడా కరిగిపోతోంది. ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిస్తే.. టవర్ కూలిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ హైటెన్షన్ విద్యుత్ లైను పక్కనే నేషనల్ హైవేతోపాటు దేవరాజుగట్టు నుంచి ఒంగోలు వెళ్లే హైవే రోడ్డు ఉంది. ఏ మాత్రం టవర్ ఒరిగి పడినా విద్యుత్ తీగలు తెగిపడి భారీగా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం సంభవించే ప్రమాదముంది. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మట్టిమాఫియా ఆగడాలను అరికట్టేందుకు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దరిమడుగు వద్ద అక్రమంగా
మట్టి తవ్వకాలు
హైటెన్షన్ విద్యుత్ వైర్ల పక్కనే నేషనల్ హైవే
టవర్ కూలితే భారీ నష్టం తప్పదని ప్రజల ఆందోళన


