ఉపాధి చట్టాన్ని కాపాడుకునేందుకు ఉద్యమం
ఒంగోలు టౌన్: రగామీణ ప్రజలకు జీవనోపాధిని కల్పిస్తూ వలసలు అరికట్టడంలో గణనీయమైన పాత్ర పోషించిన మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టాన్ని కాపాడుకునేందుకు ప్రజలంతా పోరాటాలకు సిద్ధం కావాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కంకణాల ఆంజనేయులు పిలుపునిచ్చారు. స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం నాలుగు సంఘాల సంయుక్త సమావేశం నిర్వహించారు. నెరుసుల వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించిన సమావేశంలో నిరసన కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కంకణాల ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టం రాకముందు అనేక దశాబ్దాల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పనైనా చూపండి..తిండయినా పెట్టండి అంటూ పోరాటాలు జరిగాయని గుర్తు చేశారు. 2005లో పార్లమెంట్‌లో 62 మంది ఉన్న వామపక్షాలకు 18 మంత్రి పదవులు ఇస్తామని ఆనాటి యూపీఏ ప్రభుత్వం ప్రతిపాదించిందని, పదవులకు బదులుగా గ్రామీణ పేదలకు ఉపాధి గ్యారంటీ చట్టం కావాలని వామపక్షాలు కోరాయని తెలిపారు. వామపక్ష పార్టీల ప్రయత్నంతోనే దేశంలో ఉపాధి హామీ చట్టం అమల్లోకి వచ్చిందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనతో పాటు వలసల నివారణ, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు, శాశ్వత ఆస్తులు సమకూర్చడం వంటివి ఉపాధి హామీతో సాధ్యమైందన్నారు. పేదల జీవన ప్రమాణాలు కొంతమేర మెరుగయ్యాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న కూలీలతో పాటుగా మధ్య తరగతికి చెందిన రైతు కుటాంబాల నుంచి కూడా ఉపాధి పనులు చేసుకున్నారని చెప్పారు. ఉపాధి హామీ పథకంతో గ్రామీణ ప్రజల కొనుగోలు శక్తి పెరిగి దేశాభివృద్ధికి దోహదపడిందన్నారు. కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి వి.బాలకోటయ్య మాట్లాడుతూ ఉపాధి హామీ చట్టాన్ని పేదలకు వ్యతిరేకంగా మార్చడమే కాకుండా పేరు మార్చి నిర్వీర్యం చేయడం కేంద్ర పాలకుల దమననీతికి నిదర్శనమన్నారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తూనే ఉందన్నారు. 90 శాతం నిధులకు కేంద్రం భరిస్తుండగా ఇప్పుడు దాన్ని 60 శాతంగా మార్చడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయించకుండా ఈ చట్టాన్ని పూర్తిగా నిలిపివేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఉపాధి హామీ చట్టాన్ని రక్షించుకునేందుకు ఉధృతంగా ఉద్యమాలను నిర్మిస్తామని చెప్పారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎం.రమేష్, రైతు సంఘం సీనియర్ నాయకులు పెండ్యాల హనుమంతరావు, గంగవరపు రమేష్‌బాబు, ఉబ్బా వెంకటేశ్వర్లు, పి.శ్రీను, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.


