ప్రైవేటీకరణపై ఉద్యమం తీవ్రతరం
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం కోటి సంతకాలతో ఉద్యమం ఆగదు ప్రభుత్వమే నిర్వహించే వరకూ పోరాటం ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేసిన చంద్రబాబు వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి కోటి సంతకాల ఉద్యమానికి అనూహ్య స్పందన: బూచేపల్లి
ఒంగోలు సిటీ: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఉద్యమం కోటి సంతకాలతో ఆగిపోదని, ప్రభుత్వమే వీటిని నిర్వహించేలా నిర్ణయం తీసుకునే వరకూ ఆందోళనలను తీవ్రతరం చేస్తామని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. పేదల ఆరోగ్యంతో చంద్రబాబు ప్రభుత్వం ఆటలాడుతోందని, ఆరోగ్యశ్రీని అటకెక్కించిందని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తోందని ఆయన ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. పేదలకు ఖరీదైన వైద్యం ఉచితంగా అందించేందుకు వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆరోగ్యశ్రీని మరింత పటిష్టం చేసిందన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోనే కాదు చైన్నె, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం చేయించుకునే అవకాశం ఉండేదన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేద, మధ్య తరగతి ప్రజలు వైద్య విద్యతో పాటు, సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు జగన్‌మోహన్‌రెడ్డి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్నారు. మెడికల్ కళాశాలలు వస్తే సూపర్ స్పెషాలిటీ వైద్యులు, సీనియర్ వైద్యులు అందుబాటులో ఉంటారని, అంతే కాకుండా తక్కువ ఖర్చుతో వైద్య విద్య నేర్చుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. ఆ కళాశాలలను నేడు చంద్రబాబు ప్రైవేటుపరం చేస్తూ కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ఈ నిర్ణయం ఫలితంగా రూ.కోట్లు ఖర్చు పెట్టి సీట్లు కొనుక్కునే పరిస్థితి దాపురిస్తుందని ధ్వజమెత్తారు. దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తూ కోటి సంతకాలు సేకరించేందుకు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారని చెప్పారు. కార్యక్రమానికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందన్నారు. స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి సంతకాలు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో దుర్మార్గపాలన జరుగుతోందని విమర్శించారు. దాచుకో, దోచుకో, పంచుకో అనేలా పాలన సాగుతోందని కారుమూరి ధ్వజమెత్తారు. జగన్‌మోహన్‌రెడ్డి కోట్లాది రూపాయల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చంద్రబాబు అండ్‌కో ఎన్నో ఆరోపణలు చేసిందన్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి జగన్ పేదలు అండగా నిలిచారన్నారు. అది తట్టుకోలేని వారు అసత్య ప్రచారాలు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ ఏ పథకాలూ అమలు చేయకుండా రూ.2.76 లక్షల కోట్లు అప్పుచేసి ఏం చేశారని ప్రశ్నించారు. రూ.5 వేల కోట్లతో మెడికల్ కళాశాలలన్నీ పూర్తయ్యే అవకాశం ఉందన్నారు. రూ.2.76 లక్షల కోట్లలో రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి కళాశాలలను పూర్తి చేసి ఉండొచ్చుకదా అని ఆయన చంద్రబాబును ప్రశ్నించారు. ‘‘డాక్టర్లకు, సిబ్బందికి జీతాలు ప్రభుత్వం ఇస్తుందంట, లాభాలు మాత్రం ప్రైవేటు వ్యక్తులు తీసుకుంటారంట ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌ను చంపేస్తే ఏమవుతుందని రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి అన్నారని, అలాగే చంద్రబాబు కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. వైజాగ్‌లో రూ.50 కోట్లు విలువజేసే స్థలాన్ని యాదవుల కళ్యాణ మండపం కోసం ఇస్తే నేడు దానిని రద్దు చేసి శివారులో ఎక్కడో స్థలం ఇవ్వడం వారికి అన్యాయం చేయడం కాదా అని కారుమూరి ప్రశ్నించారు. బీసీలకు అన్యాయం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో మీ సొంత మీడియాతో అసత్య ప్రచారాలు చేయించుకుంటున్నారని, అన్నింటిలో లోకేష్ చక్రం తిప్పుతున్నాడని, సొంత మీడియాలో డబ్బాలు కొట్టుకుంటున్నారని, మీ వైఫల్యాలను జాతీయ జర్నలిస్ట్ ఆర్నబ్ గోస్వామి ఎండగడుతున్నాడని గుర్తు చేశారు.
కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన..
చంద్రబాబు కుట్రలతో ప్రభుత్వం చేపట్టాల్సిన మెడికల్ కళాశాలను ప్రైవేటీకరణ చేస్తున్నారని, దీనికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వచ్చిందని దర్శి ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. పార్టీ అధినేత జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ప్రజలే స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు చేశారన్నారు. ప్రతి నియోజకవర్గంలో 60 వేల నుంచి 80 వేల వరకూ సంతకాల సేకరణ జరిగిందన్నారు. ప్రజల నుంచి సేకరించిన సంతకాల పుస్తకాలను అన్ని నియోజకవర్గాల నుంచి ఈ నెల 10 తేదీన జిల్లా పార్టీ కార్యాలయానికి తీసుకొస్తారన్నారు. ఒంగోలులో మినీ స్టేడియం నుంచి బయలుదేరి కలెక్టరేట్ వరకూ భారీ ర్యాలీగా వెళ్లి అక్కడ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద పూలమాలలు వేస్తామన్నారు. పేదలకు అండగా నిలిచేందుకు చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ స్వచ్ఛందంగా తరలి రావాలని బూచేపల్లి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ, ఒంగోలు పార్లమెంట్ పరిశీలకుడు బత్తుల బ్రహ్మానందరెడ్డి, యర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకరరావు, మాజీ మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, మాజీ ఎమ్మెల్యేలు కదిరి బాబురావు, ఉడుముల శ్రీనివాసరెడ్డి, కసుకుర్తి ఆదెన్న, ఒంగోలు, కనిగిరి నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు చుండూరి రవిబాబు, దద్దాల నారాయణ యాదవ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు కేవీ రమణారెడ్డి, వై.వెంకటేశ్వరరావు, బొట్ల రామారావు పాల్గొన్నారు.


