అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి
● వర్ధంతి కార్యక్రమంలో మంత్రి డోలా
ఒంగోలు వన్‌టౌన్: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖామంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి కోరారు. అంబేడ్కర్ 69వ వర్ధంతి సందర్భంగా శనివారం ఒంగోలు నగరంలోని హెచ్‌సీఎం కళాశాల ఎదురుగా ఉన్న ఆయన విగ్రహానికి కలెక్టర్ పి.రాజాబాబు, తదితరులతో కలిసి మంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అంబేడ్కర్ చూపిన మార్గంలో బడుగు, బలహీనవర్గాల సంక్షేమానికి పలు పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. అంబేడ్కర్ గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపై ఉందన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ సమ సమాజ స్థాపన కోసం అవిశ్రాంతంగా కృషిచేసిన గొప్ప వ్యక్తి అంబేడ్కర్ అని కొనియాడారు. ప్రపంచానికే ఆదర్శవంతమైన రాజ్యాంగాన్ని మన దేశానికి అంబేడ్కర్ అందించారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు జనార్దన్, విజయకుమార్, నగర మేయర్ సుజాత, డీఆర్‌ఓ ఓబులేసు, జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్ లక్ష్మానాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్జున్‌నాయక్, ఆర్డీవో లక్ష్మీప్రసన్న, ఒంగోలు కమిషనర్ వెంకటేశ్వరరావు, ఒంగోలు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఆర్.వెంకట్రావు, దళిత సంఘాల నాయకులు నీలం నాగేంద్రరావు, బిల్లా చెన్నయ్య, చప్పిడి వెంగళరావు, తదితరులు పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆలోచనలతో శక్తివంతమైన
దేశ నిర్మాణం: ఎస్పీ హర్షవర్థన్‌రాజు
ఒంగోలు టౌన్: దేశ ప్రజలందరికీ సమాన హక్కులు ప్రసాదించే విధంగా రాజ్యాంగాన్ని రచించిన అంబేడ్కర్ ఆలోచనలను అమలు చేయడం మనందరి బాధ్యతని, తద్వారా శక్తివంతమైన దేశ నిర్మాణంలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ఎస్పీ హర్షవర్థన్‌రాజు పిలుపునిచ్చారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలో అంబేడ్కర్ వర్ధంతి నిర్వహించారు. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రజాస్వామ్య స్ఫూర్తిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన మహానుభావుడు అంబేడ్కర్ అని కొనియాడారు. కుల నిర్మూలను కోసం చివరిదాకా పోరాడారని, బహుజనుల సామాజిక హక్కుల కోసం అహర్నిశలు శ్రమించారని చెప్పారు. కార్యక్రమంలో ఎస్బీ డీఎస్పీ చిరంజీవి, ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్, సీఐలు మేడా శ్రీనివాసరావు, నాగరాజు, సుధాకర్, పాండురంగారావు, శ్రీకాంత్ బాబు, వెంకటేశ్వర్లు, ఆర్‌ఐ రమణారెడ్డి పాల్గొన్నారు.
అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి


