రంగస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాచర్ల: మండలంలోని జేపీ చెరువు సమీపం నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయక స్వామి ఆలయానికి భక్తులు శనివారం అధిక సంఖ్యలో తరలి వచ్చారు. స్వామి దర్శనం కోసం గంటలు తరబడి క్యూలో నిలబడ్డారు. తొలుత దేవస్థానం అర్చకులైన అన్నవరం సత్యనారాయణచార్యులు, అన్నవరం పాండురంగాచార్యులు స్వామి వారిని ప్రత్యేక పూలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు తీర్థప్రసాదాన్ని పంచిపెట్టారు. భక్తులకు కాశీనాయన రెడ్లు, యోగి వేమనరెడ్లు, గోపాలకృష్ణ యాదవ, కృష్ణదేవరాయుల కాపు బలిజ, ఆర్యవైశ్య అన్నసత్రాల్లో అన్న సంతర్పణ చేశారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి మల్లవరపు నాగయ్య పాల్గొన్నారు.
మార్కాపురం టౌన్: పట్టణంలోని జవహర్‌నగర్ కాలనీలో ఉన్న శ్రీదేవి భూదేవి సమేత అమలక లక్ష్మీనారాయణ స్వామి ఆలయాభివృద్ధికి ఎన్‌ఆర్‌ఐ దుగ్గెంపూడి సత్యనారాయణరెడ్డి, సుధారాణి దంపతులు రూ.1.50 లక్షల విరాళం అందజేసినట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు డాక్టర్ డీవీ కృష్ణారెడ్డి శనివారం తెలిపారు. ఈ నిధులతో ఆలయ అభివృద్ధితో పాటు ఏసీ కల్యాణ మండ పం కూడా నిర్మించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా దాత సత్యనారాయణరెడ్డి దంపతులు ఆలయంలో పూజల అనంతరం అర్చకులు రఘునాధాచార్యులు, చరణ్‌లు శేషవస్త్రాలు, ప్రసాదం అందించారు. అధ్యక్షురాలు జి.వరలక్ష్మి, ప్రధాన కార్యదర్శ జీసీ వెంకటరెడ్డి, సభ్యులు కె.వేణుగోపాల్‌రెడ్డి, వై. సత్యనారాయణరెడ్డి, ఎస్.యోగిరెడ్డి పాల్గొన్నారు.
మార్కాపురం: నల్లమల అటవీ ప్రాంతంలో ఈ నెల ఒకటో తేదీ నుంచి జరుగుతున్న సర్వేలో భాగంగా 6వ రోజైన శనివారం శాఖాహార జంతువుల సర్వే చేపట్టినట్టు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నాగరాజు తెలిపారు. గుండంచర్ల బీట్‌లోని రిజర్వు ఫారెస్టు చిన్న ఎడ్లపాయ ఏరియా నుంచి కంపాస్, రేంజ్ ఫైండర్ల ద్వారా శాఖాహార జంతువుల సర్వే చేపట్టామని, ఎకలాజికల్ యాప్‌లో వివరాలు నమోదు చేస్తున్నట్లు చెప్పారు. 7, 8, తేదీల్లో కూడా శాఖాహార జంతువుల సర్వే ఉంటుందన్నారు. ప్రతి 400 మీటర్ల పరిధిలో ఉన్న పెద్ద వృక్షాలు, పొదలు, కలుపు మొక్కలు, మెడిసిన్ ప్లాంట్, గడ్డిజాతి మొక్కలను నమోదు చేస్తున్నట్లు పేర్కొన్నారు. బేస్ క్యాంపు సిబ్బంది నాగయ్య, జానీ పాల్గొన్నారు.
రంగస్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు


