 
															కన్నీళ్లు ఉబికి!
అన్నదాతపై ‘మోంథా‘ పిడుగు భారీ వర్షాలకు నీట మునిగిన పంటలు చెరువులను తలపిస్తున్న పొలాలు మూడు రోజులుగా నీటిలో కర్షకుని కష్టం నీళ్లు బయటకు వెళ్లేందుకు మరో రెండు రోజులు 93,030 పైగా ఎకరాల్లో పంటలు వర్షార్పణం పత్తి, సజ్జ రైతు కుదేలు.. భారీగా దెబ్బతిన్న వరి, పొగాకు అసలే గిట్టుబాటు లేక అల్లాడుతున్న రైతులపై కోలుకోలేని దెబ్బ పంట నష్టాన్ని తగ్గించే చూపించే ప్రయత్నంలో ప్రభుత్వ పెద్దలు
ఆశలు మునిగి..
పంటల నష్టాన్ని తగ్గించే కుట్ర..
కొండపిలో కొట్టుకుపోయిన పొగనారుమడులు
సాయం అందకపోతే చావే శరణ్యం..
మూడున్నర ఎకరాల్లో పత్తి, మూడెకరాల్లో పొగాకు, ఎకరా పొలంలో మిర్చి సాగుచేశాను. మిర్చికి ఎకరాకు రూ. లక్ష వరకూ ఖర్చు వచ్చింది. పొగాకుకు, పత్తికి ఎకరాకు రూ.30 వేల ఖర్చు వచ్చింది. అయితే ఈ మూడురోజుల్లో కురిసిన వానతో పంటలు దెబ్బతిన్నాయి. పత్తి చెట్లు మొత్తం చనిపోయాయి. కాయ రంగు మారింది. పెట్టుబడులు, ఎరువులు, పురుగుమందుల షాపుల వారివద్ద అప్పులు తెచ్చి వ్యవసాయం చేశాము. ప్రభుత్వం ఏదైనా సాయం చేస్తేనే మేము బతకగలుగుతాం. లేదంటే చావే శరణ్యం.
– ఉడుముల రమణారెడ్డి, జమ్మనపల్లి గ్రామ రైతు
సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఖరీఫ్‌లో పండిన పంటలకు ఒక పక్క గిట్టుబాటు ధరలు లేక అల్లాడుతున్న రైతన్న కష్టాన్ని మోంఽథా తుపాను తుడిచేసింది. భారీ వర్షాలు అన్నదాతకు కోలుకోలేకుండా చేశాయి. మోంథా తుపానుకు ముందు ఆరు రోజుల నుంచి వర్షాలు కురుస్తూ వచ్చాయి. 27వ తేదీ నుంచి మోంథా విశ్వరూపం చూపించింది. వరుసబెట్టి కురిసిన జిల్లాలో భారీ ఎత్తున పంట నష్టం వాట్లింది. మోంథాకు ముందుగా కురిసిన వర్షాకు జరిగిన పంట నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 26,250 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని తేల్చారు. 27వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమైన భారీ వర్షాలు 29వ తేదీ తెల్లవారుజాము వరకూ కురుస్తూనే ఉన్నాయి.
93 వేల ఎకరాలకు పైగా దెబ్బతిన్న పంటలు
జిల్లా వ్యాప్తంగా మోంథా తుఫానుకు, దానికి ముందు వరుసబెట్టి కురిసిన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 75 వేల ఎకరాలకు పైగా పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా పత్తి పంటకు అత్యధికంగా నష్టం వాటిల్లింది. పత్తి ఒక కోత పూర్తయి రెండో కోతకు ఉపక్రమించే సరికి భారీ వర్షాలకు తడిచి ముద్దయింది. తరువాత సజ్జ కంకులు నీటిలో తడిచిపోయి మొలకలు వస్తున్నాయి. మినుము వేసిన రైతులకు ఒక్క పైసా కూడా అందని పరిస్థితి దాపురించింది. రబీలో పంటలు ప్రస్తుతానికి 10 నుంచి 15 శాతం సాగు లోకి వచ్చాయి. ఖరీఫ్‌లో వేసిన పంటల్లో మినుము కాయదశలో, మొక్కజొన్న కండె దశలో, మిర్చి పూత–పిందె దశల్లో, పత్తి కాయ, తీత దశలో, వరి పొట్ట, కంకి దశల్లో ఉన్నాయి. రెండు, మూడు నెలల్లో పంట చేతికొస్తుంది. ఈ సమయంలో తుపాను రూపంలో మొత్తం ఊడ్చేసింది.
ప్రాథమిక అంచనా నష్టం రూ.150 కోట్లకు పైగా...
వరుసబెట్టి కురిసిన వర్షాలకు, మోంథా తుపానుకు కలిపి దాదాపు 93 వేల ఎకరాలకు పైగా పంటలు దబ్బెతిన్నట్లు సమాచారం. దాదాపు 35 మండలాలకు పైగా 27 వేల మందికి పైగా రైతులు పంటలు నష్టపోయినట్లు స్పష్టమవుతోంది. మరో రెండు మూడు రోజుల పాటు పంట పొలాల్లో నుంచి వర్షం నీరు బయటకు పోయే అవకాశమే లేదు. దీంతో నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. మిర్చి ఎకరాకు రూ.లక్షకు పైగా నష్టం వాటిల్లినట్లు అంచనా. పత్తికి ఎకరాకు రమారమి రూ.60 నుంచి 70 వేలు, మొక్కజొన్న, మినుముకు రూ.45 వేల చొప్పున, వరికి రూ.30 వేలు చొప్పున, సజ్జ, జొన్న, వేరుసెనగ, పొగాకు, కూరగాయల తోటలతో పాటు ఇతర నష్టపోయిన అనేక పంటలకు మొత్తం కలుపుకొని రూ.150 కోట్లకు పైగా రైతులు పంటలు నష్టపోయినట్లు తెలుస్తోంది.
ఖరీఫ్, రబీ రెండు సీజన్ల పంటలకు దెబ్బే....
భారీ వర్షాలకు ఖరీప్ సీజన్‌లో సాగు చేసిన పంటలు, సెప్టెంబరు ఆఖరు నుంచి సాగు చేసిన రబీ పంటలు నిలువునా దెబ్బతిన్నాయి. ప్రధానంగా పత్తి, మిర్చి, వరి, మినుము, సజ్జ, జొన్న, బొబ్బర్లతో పాటు అనేక రకాల పంటలు నీట మునిగాయి. రైతులు సాగు చేసిన పంటలను వరుసబెట్టి కురిసిన వర్షాలు, తరువాత వచ్చిన మోంథా తుఫాను పంటలను తుడిచిపెట్టేశాయి. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 3,22,755 ఎకరాల్లో సాగు చేయాల్సి ఉంది. అయితే వర్షాభావం ఏర్పడటంతో కేవలం 2,10,033 ఎకరాల మాత్రమే సాగు చేశారు. అంటే ఖరీఫ్ సీజన్లో 1,12,722 ఎకరాల్లో అసలు పంటలే సాగు చేయలేదు.
చంద్రబాబు ప్రభుత్వం రైతులకు రూ.45.27 కోట్ల బకాయి
చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలోని రైతులకు రూ.45.27 కోట్లు బకాయి పడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కరువు, అకాల వర్షాలు, అతివృష్టి, అనావృష్టికి నష్టపోయిన రైతులకు ఇంత వరకు పంట నష్ట పరిహారం(ఇన్‌పుట్ సబ్సిడీ) ఇంత వరకు ఒక్క పైసా కూడా విదల్చలేదు. మొదటి ఏడాది 2023–24 సంవత్సరంలో 31 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. ఆ సంవత్సరానికి రూ.29.39 కోట్లు బకాయి ఉంది. ఆ తరువాత సంవత్సరం 2024–25లో 17 మండలాలు కరువు మండలాలుగా ప్రకటించారు. ఆ సంవత్సరం రూ.15.88 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉంది. మొత్తంగా రెండు సంవత్సరాలకు గాను జిల్లాలో 74,400 ఎకరాల్లో పంట నష్ట పోయిన 36,147 మంది రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంది. తాజా విపత్తు సాయం ఎప్పటికి అందుతోనన్న భయాందోళనలు రైతులు వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఏ సీజన్‌లో నష్టపోయిన రైతులకు ఆ సీజన్‌లోనే అందించి అన్నదాతకు వెన్నుదన్నుగా నిలిచారు వైఎస్ జగన్‌మోహన రెడ్డి.
తుపాను సమర్ధంగా ఎదుర్కొన్నాం. నష్టాన్ని నిలువరించాం.. అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి నాయకులు చెబుతున్న మాటలు. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఇంకా పంట పొలాలు చెరువులను తలపిస్తూనే ఉన్నాయి. నీరు బయటకు పోకుండా నష్టాన్ని నివారించామనడం నిలువునా మోసం చేయటమే అని రైతు సంఘాలు మండిపడుతున్నాయి. తుపానుకు ముందు వరుసబెట్టి కురిసిన వర్షాలకు 26,250 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయని తేల్చిన అధికారులు, మోంథా తుపాను అనంతరం 33,750 ఎకరాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమికంగా అంచనాలు రూపొందించారు. అంటే రెండూ కలుపుకుంటే 60 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు అన్నమాట. ఈ విధంగా కాకుండా పంట నష్టాన్ని వక్రీకరించే పనిలో నిమగ్నమైంది ప్రభుత్వం.
సహాయక చర్యల్లో వీక్.. ప్రచారంలో పీక్
సాక్షి, అమరావతి: మోంథా తుపాను సహాయక చర్లల్లో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. కానీ ప్రచార్భాటంలో మాత్రం హంగామా చేసిందని వైఎస్సార్ సీపీ నేతలు ధ్వసమెత్తారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వైఎస్ జగన్‌తో ఎవరెవరు ఏమేం మాట్లాడారంటే..
రైతులంతా మిమ్మల్నే తల్చుకుంటున్నారు
బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు
ప్రకాశం జిల్లాలో 25 వేల ఎకరాల్లో వరికి నష్టం జరిగింది. 15 వేల మంది రైతులు ప్రభావానికి లోనయ్యారు. ఇప్పుడు రైతులంతా మిమ్మల్నే తల్చుకుంటున్నారు. నాడు పంట పండితే, మంచి ధర దక్కింది. పంట నష్టం జరిగితే, పరిహారం అందేది. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
రైతులకు ఎలాంటి సాయం అందలేదు..
మేరుగు నాగార్జున, మాజీ మంత్రి
ఇది వరకు తుపాను లాంటి విపత్తులు సంభవిస్తే రైతు భరోసా కేంద్రాల సిబ్బందితో వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయం చేసుకుంటూ పనిచేశారు. ఈ రోజు ఆ లేమి కనిపిస్తుంది. ప్రజలు ఈ సందర్భంగా మన ప్రభుత్వాన్ని తలుచుకుంటున్నారు. ఆ రోజు మనం రైతుకు ఎంత అండగా నిలిచామో గుర్తు చేసుకుంటున్నారు. ఈ తుపాను వల్ల రైతు కుదేలయ్యాడు. తుపాను తుపాను అంటూ కూటమి ప్రభుత్వం అధికారులతో హడావుడి చేసింది కానీ రైతులకు ఎలాంటి సాయం అందలేదు.
 
							కన్నీళ్లు ఉబికి!
 
							కన్నీళ్లు ఉబికి!

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
