 
															బాధితులను ఆదుకోవాలి
ముండ్లమూరు(దర్శి): తుపాను బాధితులను ఆదుకొని ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం అందించాలని దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి డిమాండ్ చేశారు. మోంథా తుపాను ప్రభావంతో మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం, పసుపుగల్లు గ్రామాల్లో దెబ్బతిన్న వరి, పత్తి, మొక్కజొన్న, జొన్న, మిరప పంటలను గురువారం పరిశీలించి బాధిత రైతులతో మాట్లాడారు. పంటల సాగుకు ఎంత పెట్టుబడి పెట్టారో రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బూచేపల్లి మాట్లాడుతూ నియోజకవర్గంలో తుపాను ప్రభావంతో 15 నుంచి 20 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లిందన్నారు. వరి, మొక్కజొన్న, మిరప, జొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లిందని తెలిపారు. గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ క్రాప్ చేసి రైతులకు ఇన్సూరెన్సు కట్టేవారని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో రైతులే ఇన్సూరెన్సు కట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తరువాత రెండుసార్లు వర్షాలకు పంటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోతే పైసా విదిల్చిన పాపాన పోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ఎప్పుడూ రైతులను మోసం చేస్తూనే ఉన్నారన్నారు. గత ప్రభుత్వంలో పార్టీలకతీతంగా పంట నష్టపోయిన రైతులందరి ఖాతాల్లో నగదు జమ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కూటమి రైతు వ్యతిరేక ప్రభుత్వమని పేర్కొన్నారు. అగ్రహారం గ్రామంలో 10 హెక్టార్లలో మాత్రమే పంట దెబ్బతిందని ఉద్యావన శాఖాధికారులు అంటున్నారని, కానీ ఆ గ్రామంలో వెయ్యి ఎకరాల్లో 60 శాతం పంట నీళ్లలో ఉందన్నారు. జాప్యం లేకుండా నష్టపోయిన రైతులను ఆదుకొని నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు చింత శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ సుంకర సునీతాబ్రహ్మానందరెడ్డి, మహిళ విభాగం కార్యదర్శి మేడికొండ జయంతి, రైతువిభాగం అధ్యక్షుడు బంకా నాగిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సూదిదేవర అంజయ్య,, కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ నాయకులు రైతులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
